BRS Launch KCR Bharosa Campaign in Telangana : కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అక్కడ ఐదు గంటల కరెంట్ మాత్రమే ఇస్తోందని కేటీఆర్ ఆరోపించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇక్కడ వ్యవసాయానికి 3 గంటల విద్యుత్ మాత్రమే చాలంటున్నారని విమర్శించారు. గ్రహపాటున హస్తం పార్టీకి ఓటేస్తే.. మూడు గంటల కరెంటే దిక్కవుతుందని అన్నారు. 24 గంటల కరెంట్ ఇస్తున్న కేసీఆర్ కావాలా? మూడు గంటల విద్యుత్ చాలంటున్న కాంగ్రెస్ కావాలా? రాష్ట్ర ప్రజలు ఈ విషయంలో ఆలోచన చేయాలని.. కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
మంత్రి కేటీఆర్ (KTR ) సమక్షంలో పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ నేతలు సత్యనారాయణ రెడ్డి, రామ్మూర్తి, హాజీ, మహబూబ్‌నగర్ జిల్లా హస్తం పార్టీ నాయకుడు ముత్యాల ప్రకాశ్ తదితరులు.. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్‌లో చేరారు. వారికి మంత్రి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు.
"కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నాం. విద్యుత్ సమస్య, నీళ్ల సమస్య పరిష్కరించుకున్నాం. కర్ణాటకలో కరెంట్ లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. కేసీఆర్ మళ్లీ గెలిస్తే కచ్చితంగా జాబ్ క్యాలెండర్ అమలు చేస్తాం. కేసీఆర్ భరోసా కింద 15 కార్యక్రమాలు అమలు చేస్తాం. కేసీఆర్ భరోసా కింద రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం ఇస్తాం." - కేటీఆర్, మంత్రి
KCR Bharosa Campaign 2023 :కేసీఆర్ భరోసా పేరిట కొత్త కార్యక్రమం అమలు చేస్తామని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ మళ్లీ గెలిస్తే.. ఏం చేస్తామో భరోసాలో చెప్తున్నామని అన్నారు. రైతుబంధు కింద రూ.73,000 కోట్లు అన్నదాతల ఖాతాల్లో వేశామని పేర్కొన్నారు. రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఇస్తామని.. అర్హులైన మహిళలకు భృతిగా నెలకు రూ.3,000 ఇవ్వనున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే కచ్చితంగా జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.