BRS Formation Day Celebrations in Hyderabad: ఏటా పార్టీ ఆవిర్భావ దినం సందర్భంగా ప్లీనరీ, సభ నిర్వహించే బీఆర్ఎస్... ఈ ఏడాది భిన్నంగా జరుపుకుంది. వేడుకల్లో భాగంగానే ఇప్పటికే విస్తృత ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించిన గులాబీ దళం... ఈ నెల 25న నియోజకవర్గాల స్థాయిలో పార్టీ మినీ ప్లీనరీలను నిర్వహించారు. ఏటా నిర్వహించే ప్లీనరీకి బదులుగా అక్టోబరు 10న వరంగల్‌లో భారీ బహిరంగ సభ జరగనుండగా... ఆవిర్భావం దినోత్సవాన్నితెలంగాణ భవన్‌లోనే ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ముందుగా తెలంగాణ తల్లికి, ఆచార్య జయశంకర్ విగ్రహానికి పూల మాల వేసిన అధినేత, సీఎం కేసీఆర్... ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి అమరవీరులకు నివాళి అర్పించారు.
బీఆర్ఎస్గా మారిన తర్వాత తొలి సర్వసభ్య సమావేశం:అనంతరం, బీఆర్ఎస్ కార్యాలయంపై గులాబీ జెండాను ఎగురవేశారు. ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని.. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్‌పర్సన్లు, డీసీసీబీ, డీసీఎమ్ఎస్ ఛైర్‌పర్సన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు మొత్తం 279 మంది ప్రతినిధులు హాజరయ్యారు. పార్టీ సెక్రటరీ జనరల్, ఎంపీ కేశవరావు ప్రసంగంతో ప్రారంభమైన ఈ సమావేశం సాయంత్రం వరకు కొనసాగింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నిజం చేస్తూ ఎదిగిన టీఆర్ఎస్.. నేడు దేశ ప్రజల ఆకాంక్షలను సాకారం చేసే దిశలో జాతీయ పార్టీగా బీఆర్ఎస్ ఎదిగిన క్రమాన్ని అధినేత కేసీఆర్ ఈ సందర్భంగా వివరించారు.