ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. పూర్తి చేయాల్సిన పనులపై సర్కార్ ఫోకస్ Telangana Government on Pending Issues :రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. నవంబర్ లేదా డిసెంబర్లో జరగనున్న ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు ఇప్పట్నుంచే కసరత్తు వేగవంతం చేశాయి. ఎత్తులు పైఎత్తులు, విమర్శలు, ప్రతి విమర్శలు, రాజీనామాలు, చేరికలతో రాష్ట్ర రాజకీయం వేడెక్కింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పూర్తి చేయాల్సిన వాటిపై సర్కార్ దృష్టి సారించింది.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. పూర్తి చేయాల్సిన పనులపై సర్కార్ దృష్టి :గతంలో ఇచ్చిన మాట మేరకు పూర్తి చేయాల్సిన వాటి విషయంలో చర్యలు ప్రారంభించింది. వీఆర్ఏల క్రమబద్దీకరణ,సర్దుబాటు ప్రక్రియను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని గడువు పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం బుధవారం సమావేశమై వీఆర్ఏ ఐకాస నుంచి అభిప్రాయాలు తీసుకొంది. రెండు రోజుల్లో మరోమారు సమావేశం కావాలని, ఈలోగా కసరత్తు పూర్తి చేయాలని అధికారులను మంత్రులు అదేశించారు.
Telangana Assembly Elections 2023 : జూనియర్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్దీకరణ కసరత్తు కూడా ఒకటి, రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. జేపీఎస్‌ల పనితీరును మదింపు చేసేందుకు జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు కానున్నాయి. కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి, పోలీసు అధికారులు, ఇతరులతో కూడిన కమిటీ వారి నాలుగేళ్ల పనితీరు, లక్ష్యాల సాధనను పరిశీలించనున్నారు. ఆ తర్వాతరాష్ట్ర స్థాయి కమిటీ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని క్రమబద్దీకరణ ప్రక్రియను పూర్తి చేయనుంది. జేపీఎస్‌ల సంబంధిత ప్రక్రియపై ఇవాళ మంత్రి ఎర్రబెల్లి సమీక్ష నిర్వహించనున్నారు. కమిటీల ఏర్పాటుకు సంబంధించి నేడో, రేపో ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఇంకా మిగిలిన ఇతర అంశాల, పరిష్కరించాల్సిన వాటిపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించిందని, కసరత్తు వేగవంతం అవుతుందని అధికార వర్గాలు చెప్తున్నాయి.
Telangana Govt Focus on Assembly Elections 2023 :నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన పనులు, క్షేత్రస్థాయి అవసరాల విషయమై శాసనసభ్యులు దృష్టి పెట్టారు. వీలైనంత త్వరగా ఆమోదం పొంది.. పనులను ప్రారంభించుకునేందుకు గానూప్రభుత్వ పెద్దలను కలిసి కొత్త పనులకు అనుమతితీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి వద్ద ఉండే ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి ఆయా పనులను మంజూరు చేసుకునే పనిలో పడ్డారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను కూడా త్వరితగతిన పూర్తి చేసుకునే పనిలో ఎమ్మెల్యేలు నిమగ్నమయ్యారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చే నాటికి అన్ని పెండింగ్ పనులను పూర్తి చేసేలా సర్కార్ చర్యలు తీసుకుంటోంది.
ఇవీ చదవండి: