BRS Focus on LokSabha Elections 2024 : రాష్ట్రంలో హ్యాట్రిక్ విజయంపై కన్నేసి పరాజయం పాలైన బీఆర్ఎస్(BRS), త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో పుంజుకోవాలని భావిస్తోంది. శాసనసభ ఎన్నికల్లో ఎదురైన అనూహ్య ఓటమితో ఆ పార్టీ నేతలు, శ్రేణులు ఇంకా పూర్తిగా కోలుకోలేదనే చెప్పవచ్చు. ఓటమిని విశ్లేషిస్తున్న గులాబీ నాయకత్వం, ఆయా నియోజకవర్గాల నాయకులతో మంతనాలు జరుపుతోంది. ఓడిపోవడానికి గల కారణాలను తెలుసుకుంటూనే తదుపరి కార్యాచరణపై దృష్టి సారిస్తోంది.
లోక్‌సభ ఎన్నికలపై అంతర్గతంగా కసరత్తు : త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు (LokSabha Elections 2024) పార్టీ నేతలు, శ్రేణులను సిద్ధం చేసేందుకు బీఆర్ఎస్ నాయకత్వం సిద్ధమవుతోంది. మెజార్టీ స్థానాలను దక్కించుకోవడం ద్వారా సత్తా చాటాలని భావిస్తోంది. 2019 ఎన్నికల్లో సారు-కారు-పదహారు నినాదంతో వెళ్లిన గులాబీ పార్టీ, కేవలం తొమ్మిది స్థానాలకు మాత్రమే పరిమితమైంది. పెద్దపల్లి, జహీరాబాద్, మెదక్, చేవెళ్ల, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గాల్లో మాత్రమే భారత్ రాష్ట్ర సమితి అభ్యర్థులు గెలుపొందారు.
'ఫలితాలను చూసి నిరాశపడొద్దు - బీఆర్‌ఎస్‌కు ఇది తాత్కాలిక స్పీడ్ బ్రేక్ మాత్రమే'
ఏడు లోక్‌సభ నియోజకవర్గాల్లో మాత్రమే ఎక్కువ ఓట్లు : మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి (Kotha Prabhakar Reddy) ఇటీవలి ఎన్నికల్లో, దుబ్బాక నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూస్తే బీఆర్ఎస్‌కు ఏడు లోక్‌సభ నియోజకవర్గాల్లో మాత్రమే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, చేవెళ్ల స్థానాల్లో మిగతా పార్టీల కంటే, భారత్ రాష్ట్ర సమితికి ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఆదిలాబాద్ పరిధిలో రెండు స్థానాల్లోనే పార్టీ అభ్యర్థులు విజయం సాధించినప్పటికీ లోక్‌సభ పరిధి మొత్తంలో మాత్రం ఎక్కువగానే వచ్చాయి.
BRS on LokSabha Elections 2024 :కరీంనగర్ పరిధిలో కూడా మూడు స్థానాల్లోనే, బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించినప్పటికీ, లోక్‌సభ పరిధి మొత్తంలో ఓట్లు మాత్రం స్వల్పం కంటే ఎక్కువగా వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్ కంటే 5000ల ఓట్లు ఎక్కువ రాగా, నిజామాబాద్ పరిధిలోనూ ఆధిక్యం స్వల్పంగానే ఉంది. అక్కడ హస్తం పార్టీ కంటే 9000 ఓట్లు ఎక్కువగా పోలయ్యాయి.