BRS Election Campaign Telangana 2023 :బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం(BRS Election Campaign) ఊపందుకుంది. దాదాపు ఏడాది క్రితం నుంచే వ్యూహాత్మకంగా ఎన్నికలకు సిద్ధమైన గులాబీ పార్టీ.. ప్రత్యక్ష ప్రచారాన్ని ముమ్మరం చేసింది. అభ్యర్థులు నియోజకవర్గంలో ఓటర్లను కలుస్తుండగా.. కేటీఆర్, హరీశ్‌రావు సుడిగాలి పర్యటనలతో జోష్ పెంచారు. ఓవైపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థానలు.. మరోవైపు పార్టీ కార్యక్రమాలతో కొన్ని నెలలుగా క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వస్తోంది. మిగతా పార్టీల కన్నా ముందుగానే ఒకేసారి 115 అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కేటీఆర్ కొన్ని రోజులు అమెరికా పర్యటనలో ఉండటం.. ఆ తర్వాత జమిలి ఎన్నికలపై ప్రచారం నేపథ్యంలో కొన్ని రోజులు స్తబ్దుగా కనిపించింది. వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూలు(Telangana Election Schedule 2023) విడుదల కావచ్చునన్న ప్రచారంతో బీఆర్ఎస్ ఒక్కసారిగా వేగం పెంచింది.
BRS Election Manifesto 2023 :ఓ వైపుకేటీఆర్.. మరోవైపు హరీశ్‌రావు హెలికాప్టర్ ద్వారా సుడిగాలి పర్యటనలతో ప్రచారం జోరు పెంచారు. ఇద్దరు మంత్రులు సుమారు 50 నియోజకవర్గాల్లో పర్యటించారు. త్వరలో ఎన్నికల కోడ్(Telangana Assembly Elections Code) రానున్నందున.. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల వేగం పెంచారు. కేటీఆర్, హరీశ్‌రావు రోజూ రెండు, మూడు నియోజకవర్గాలకు వెళ్లి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆ తర్వాత సభలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణుల్లో జోష్ పెంచుతున్నారు.
BRS Campaign Telangana Election 2023 :ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూనే రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై వాడివేడి ప్రసంగాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ను మళ్లీ ఆశీర్వదించాలంటూ కోరుతున్నారు.కాంగ్రెస్, బీజేపీలపై కేటీఆర్, హరీశ్‌రావు విరుచుకు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ(Congress Party) కాలం చెల్లిందని.. వారంటీ లేని ఆ పార్టీ చెబుతున్న గ్యారంటీలను ఎవరు నమ్ముతారని దుమ్మెత్తి పోస్తున్నారు. బీజేపీకు మతం తప్ప మరో అంశం తెలియదని.. ఆ పార్టీలో వారసత్వ రాజకీయాలు లేవా అంటూ ఎదురు దాడి చేస్తున్నారు.
Harish Rao on BRS Manifesto : 'బీఆర్ఎస్ మేనిఫెస్టో చూస్తే ప్రతిపక్షాల దిమ్మ తిరుగుతుంది'
BRS Warangal Vijaya Garjana Sabha : కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న గులాబీ దళపతి, సీఎం కేసీఆర్(CM KCR) త్వరలో రంగంలోకి దిగనున్నారు. త్వరలో కేబినెట్ సమావేశం(Cabinet Meeting) నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈనెల 16న వరంగల్‌లో జరగనున్న విజయగర్జన సభ(Vijaya Garjana Sabha)లో ప్రకటించనున్న మేనిఫెస్టోకు కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. రైతులకు ఫించను, ఉచితంగా ఎరువుల పంపిణీ తదితర అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మహిళలు, యువత, బీసీలు, మైనారిటీలకు పలు ఎన్నికల హామీలను ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూలు వచ్చిన తర్వాత కేసీఆర్ కూడా సుమారు వంద నియోజకవర్గాల్లో పర్యటించేలా ప్రణాళికలు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థులు(BRS Candidates) ఇంటింటి ప్రచారం ముమ్మరం చేశారు. కాలనీలు, బస్తీల్లో ప్రముఖులు, కుల సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తూ మద్దతు కోరుతున్నారు.