ప్రచారంలో స్పీడ్ పెంచిన కారు - వ్యతిరేకంగా ఉన్నవారిని ఆకట్టుకునేలా వ్యూహాలు BRS Election Campaign in Telangana 2023 :శాసనసభ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతోంది. హ్యాట్రిక్‌పై కన్నేసిన భారత్ రాష్ట్ర సమితి.. చివరి దశలో ప్రచారాన్ని ఉద్ధృతం చేయడంతో పాటు ఓటింగ్‌పై కూడా దృష్టి సారించింది. ఓటు బ్యాంకు లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఆయా వర్గాల నుంచి మద్దతు పొందడమే ధ్యేయంగా బీఆర్ఎస్ కార్యాచరణ అమలు చేస్తోంది. పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయన్న ప్రచారం సాగుతున్న వర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. సదరు వర్గాల ఓట్లు రాబట్టుకునే లక్ష్యంతో బీఆర్ఎస్ నేతలు ముందుకెళ్తున్నారు. అందులో భాగంగా ఆయా వర్గాల ముఖ్యనేతలతో సమావేశమవుతున్నారు.
BRS Focus on Young Voters :ఉద్యోగాల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిపై యువత గుర్రుగా ఉన్న నేపథ్యంలో ఆ వర్గంపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతతో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తొమ్మిదిన్నరేళ్ల తమ హయాంలో కల్పించిన ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, తీసుకున్న చర్యలను వారికి వివరించారు. ఇప్పటి వరకు భర్తీ చేసిన ఉద్యోగాలు, కాంగ్రెస్ హయాంలో భర్తీ చేసిన ఉద్యోగాలు తదితరాలను పోల్చి చెప్పారు. ఇప్పటి వరకు భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలు, జాబ్ క్యాలెండర్, స్టడీ సర్కిళ్లు సహా వివరాలతో ప్రత్యేక వెబ్ సైట్‌ను ప్రారంభించారు.
ప్రచారంలో కారు జోరు - నియోజకవర్గాలను చుట్టేస్తున్న కేసీఆర్ సారు - రోడ్ షోలతో బిజీబిజీగా కేటీఆర్, హరీశ్ రావు
BRS Focus on Minority Voters :మైనార్టీల ఓటు బ్యాంకుపై కూడా బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి సారించింది. ఆయా నియోజకవర్గాల వారీగా ముస్లింలతో సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రచార సభల్లో మైనార్టీల కోసం అమలు చేసిన కార్యక్రమాలను ప్రత్యేకంగా వివరిస్తున్నారు. జమా తుల్-ఉలేమా సంస్థ ప్రతినిధులతో మంత్రి హరీశ్ రావు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ సర్కార్ తొమ్మిదిన్నరేళ్లుగా అనుసరిస్తున్న లౌకికవిధానం, మైనార్టీల కోసం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి వారికి వివరించారు. కాంగ్రెస్, బీజేపీ విధానాలను పోల్చారు. ముస్లిం మైనారిటీలు బీఆర్ఎస్తో లేరంటూ కాంగ్రెస్ చేస్తున్న విషప్రచారాన్ని తిప్పికొట్టాలని కోరారు.
Telangana Assembly Elections 2023 :బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని, సంక్షేమ కార్యక్రమాలు, గంగా -జమునా తెహజీబ్‌గా సహజ సాన్నిహిత్యాన్ని దృష్టిలో పెట్టుకొని ముస్లిం సమాజం ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రితో సమావేశం అనంతరం జమాతుల్-ఉలేమా సంస్థ శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతు ప్రకటించింది. అటు ఆయా వర్గాలను ఆకట్టుకునేలా వివిధ మాధ్యమాల్లో విస్తృతంగా ప్రకటనలు ఇస్తున్నారు. సామాజిక మాధ్యమాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. కాంగ్రెస్, బీజేపీలతో పోల్చి వాస్తవాలు, అన్ని వివరాలు, తమ వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లేలా బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తోంది.
హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రచార జోరు - గులాబీ జెండాకు మద్దతివ్వాలంటూ ఊరూవాడా ప్రచారం
ఎన్నికల గడువు సమీపిస్తున్న వేళ స్పీడ్ పెంచిన కారు - గులాబీ జెండాకు మద్దతివ్వాలంటూ ఊరూవాడా ప్రచారం