తెలంగాణ

telangana

ETV Bharat / state

BRS Assembly Elections Campaign 2023 : ఆశించిన స్థాయిలో ప్రజల్లోకి వెళ్లని 'మేనిఫెస్టో'.. వ్యూహం మార్చి, ప్రచార స్పీడ్‌ పెంచిన కారు

BRS Assembly Elections Campaign 2023 : గులాబీ పార్టీ ప్రచారంలో మరింత దూకుడు పెంచేందుకు సిద్ధమవుతోంది. తాజాగా సర్వేలు చేయిస్తున్న బీఆర్‌ఎస్‌.. మేనిఫెస్టో ఆశించిన రీతిలో ప్రజల్లోకి వెళ్లలేదని భావిస్తోంది. ఇన్‌ఛార్జీలను, వార్‌రూమ్‌లను ఏర్పాటు చేసి నియోజకవర్గాల్లో అభ్యర్థులు, నేతలు ప్రచారాన్ని పకడ్బందీగా నిర్వహించేలా ప్రణాళికలు చేసింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెండో విడత పర్యటనలు గురువారం మొదలు కానున్నాయి.

KCR Election Campaign Meetings
BRS Election Campaign 2023

By ETV Bharat Telangana Team

Published : Oct 24, 2023, 7:08 AM IST

BRS Election Campaign 2023 స్పీడ్‌ పెంచిన కారు.. మేనిఫెస్టో ప్రచారంపై పకడ్బందీ ప్రణాళికలు

BRS Assembly Elections Campaign 2023 : ఎన్నికలకు మొదట్నుంచీ పక్కా ప్రణాళికలతో సిద్ధమవుతున్న భారత రాష్ట్ర సమితి(BRS).. పకడ్బందీ వ్యూహాలతో అడుగులు వేస్తోంది. కొన్ని నెలల ముందుగానే సభలు, సమావేశాలు, పార్టీ శ్రేణుల ఆత్మీయ సమ్మేళనాలు, కమిటీల నియామకాలతో కేడర్‌లో జోష్ పెంచుకుంటూ వచ్చిన గులాబీ పార్టీ.. రెండు నెలల క్రితమే అభ్యర్థులను ప్రకటించి రంగంలోకి దించింది. కేటీఆర్, హరీశ్‌రావు సుడిగాలి పర్యటనలతో దాదాపు అన్ని జిల్లాల్లో ఒక విడత ప్రచారం పూర్తి చేశారు.

BRS Manifesto 2023 : తెల్లరేషన్‌ కార్డుదారులకు 'కేసీఆర్‌ బీమా.. ప్రతి ఇంటికి ధీమా'.. రూ.4 వందలకే గ్యాస్‌ సిలిండర్‌

KCR Election Campaign Meetings :ఈ నెల 15నగులాబీ దళపతికేసీఆర్ ప్రచారం ప్రారంభించారు. ముందుగానే బీ ఫారాలు ఇచ్చేసి.. అభ్యర్థులను మార్చవచ్చునన్న అయోమయానికి, ప్రచారానికి తెరదించారు. ఈ నెల 15నే మేనిఫెస్టో ప్రకటించి.. హుస్నాబాద్ నుంచే ఎన్నికల ప్రచార సభలకు శ్రీకారం చుట్టారు. రోజుకు రెండు నియోజకవర్గాల చొప్పున.. ఇప్పటి వరకు హుస్నాబాద్, జనగామ, భువనగిరి, సిద్దిపేట, సిరిసిల్ల, జడ్చర్ల, మేడ్చల్‌లో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించారు.

తమ బలాన్ని ప్రదర్శించేలా సభలకు భారీగా జనసమీకరణ చేశారు. బతుకమ్మ, దసరా పండుగలు ఉన్నందున సభలకు విరామం ఇచ్చిన కేసీఆర్.. గురువారం నుంచి మళ్లీ సుడిగాలి పర్యటనలకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 26న అచ్చంపేట, నాగర్‌కర్నూలు, మునుగోడులో కేసీఆర్ సభల్లో పాల్గొంటారు. వచ్చే నెల 8 వరకు పాలేరు, స్టేషన్ ఘన్‌పూర్, కోదాడ, తుంగతుర్తి, ఆలేరు, జుక్కల్, బాన్సువాడ, నారాయణఖేడ్, హుజూర్‌నగర్, మిర్యాలగూడ, దేవరకొండ, సత్తుపల్లి, ఇల్లెందు, నిర్మల్, బాల్కొండ, ధర్మపురి, భైంసా, ఆర్మూరు, కోరుట్ల, కొత్తగూడెం, ఖమ్మం, గద్వాల్, మఖ్తల్, నారాయణపేట, చెన్నూరు, మంథని, పెద్దపల్లి, సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లిలో కేసీఆర్‌ పర్యటించనున్నారు.

BRS Manifesto 2023 : వృద్ధులకు రూ.5016, దివ్యాంగులకు రూ.6016.. రైతుబంధు కింద రూ.16 వేల సాయం

Telangana Assembly Elections 2023 :ఎన్నికల మేనిఫెస్టోపై ప్రజలు ఏమనుకుంటున్నారనే విషయంపై, అభ్యర్థుల పని తీరు, ప్రచార శైలి తదితర అంశాలపై బీఆర్‌ఎస్‌ సర్వేలు చేయిస్తోంది. తొమ్మిదిన్నరేళ్ల పాలనలోని సంక్షేమ ఫలితాలు ప్రజల్లో ఉన్నప్పటికీ.. కొత్త హామీలు ఆశించిన ముద్ర వేయడం లేదని సర్వేల నివేదికలు వచ్చినట్లు తెలుస్తోంది. మేనిఫెస్టో ఆశించిన రీతిలో ప్రజల్లోకి వెళ్లలేదని భావిస్తున్న గులాబీ పార్టీ.. పార్టీ శ్రేణులను అప్రమత్తం చేసింది.

ప్రెస్‌మీట్లు, ఫ్లెక్సీలు, కరపత్రాలు, పోస్టర్లు, సమావేశాలతో పాటు సోషల్‌మీడియా ద్వారా విస్తృతంగా ఎన్నికల హామీలను ఓటర్లకు చేర్చాలని దిశానిర్దేశం చేసింది. రెండు నెలల ముందుగానే అభ్యర్థులను ప్రకటించినప్పటికీ.. ఇప్పటివరకు ప్రజలను ప్రభావితం చేసే స్థాయిలో ప్రచారం జరగడం లేదని నివేదికలు అందడంతో.. ఇంఛార్జీలను, వార్‌రూమ్‌లను రంగంలోకి దించింది. ప్రణాళిక బద్ధంగా ప్రచారం సాగేలా హైదరాబాద్‌లోని సెంట్రల్ వార్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు తగిన వ్యూహాలు ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు.

కేసీఆర్, కారు గుర్తు ఏదో ఒక రూపంలో ప్రజల మనసుల్లో కదిలేలా ఫ్లెక్సీలు, సోషల్‌మీడియాలో పెంచాలని శ్రేణులను బీఆర్‌ఎస్‌ తెలిపింది. నియోజకవర్గస్థాయిలో కొందరు నేతలు ప్రచారంలో చురుగ్గా ఉండటం లేదని.. అభ్యర్థులతో సమన్వయం కుదరడం లేదని సర్వేల్లో తేలడంతో.. ఆ విషయంలోనూ తగిన సూచనలు ఇస్తోంది. అభ్యర్థులను మారుస్తారన్న గందరగోళం ఉండకూడదన్న ఉద్దేశంతో.. నోటిఫికేషన్‌కు చాలా రోజుల ముందే బీ ఫారాలు ఇచ్చిన బీఆర్‌ఎస్‌.. పది స్థానాలను మాత్రం పెండింగులో ఉంచింది.

CM KCR Bhuvanagiri Public Meeting Speech : 'కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తే.. ధరణి పోయి మళ్లీ దళారుల రాజ్యం వస్తుంది'

BRS Latest Political News : గతంలో ప్రకటించని మల్కాజిగిరిలో మర్రి రాజశేఖర్‌రెడ్డి, జనగామలో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి బీఫారాలు ఇచ్చిన గులాబీ పార్టీ... నర్సాపూర్, గోషామహల్, నాంపల్లిలో మాత్రం సస్పెన్స్ కొనసాగిస్తోంది. నర్సాపూర్‌లో మదన్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి మధ్య సయోధ్య కుదరడం లేదు. గోషామహల్ బీజేపీ అభ్యర్థి ఖరారు కావడంతో.. ఒకటి, రెండు రోజుల్లో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

నాంపల్లిలో ఎంఐఎం, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉండనుండటంతో.. కాంగ్రెస్‌ను దెబ్బతీసేలా అభ్యర్థిని ఖరారు చేసే వ్యూహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఎంఐఎం సిట్టింగ్ ఎమ్మెల్యేలున్న చార్మినార్, యాఖత్ పురా, చంద్రాయణగుట్ట, కార్వాన్, మలక్ పేట, బహదూర్‌పురాకు అభ్యర్థులు ప్రకటించినప్పటికీ.. ఇంకా బీఫారాలు ఇవ్వలేదు. ఆలంపూర్‌పై బీఆర్‌ఎస్‌లో ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్‌లో మినహా రాష్ట్రమంతటా ప్రకటించిన అభ్యర్థులకే బీ ఫారాలు ఇచ్చిన కేసీఆర్‌.. ఆలంపూర్ ఒక్కటి మాత్రం పెండింగులో పెట్టారు.

సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంనే టికెట్ ఖరారు చేసినప్పటికీ.. బీఫారం ఇవ్వకపోవడంతో.. అభ్యర్థిని మార్చవచ్చునన్న ప్రచారం జోరుగా సాగుతోంది. తనకే బీఫారం ఇవ్వాలని అబ్రహం కోరుతుండగా.. తన అనుచరుడు విజయుడు లేదా మరొకరికి ఇవ్వాలని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి పట్టుబట్టుతున్నారు. తనకు లేదా తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని మందా జగన్నాథం అడుగుతున్నారు. ఈ పరిణామాల నడుమ ఒకటి, రెండు రోజుల్లో బీ ఫారాల పంపిణీ పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది.

ఇతర పార్టీల నుంచి నేతల చేరికలను మరింత ప్రోత్సహించేందుకు బీఆర్‌ఎస్‌ కసరత్తు చేస్తోంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రోజూ చేరికలు ఉండేలా చూడాలని శ్రేణులకు పార్టీ నాయకత్వం దిశానిర్దేశం చేసింది. బీఆర్‌ఎస్‌ నుంచి పలువురు కాంగ్రెస్‌లోకి వెళ్తున్నందున.. కౌంటర్‌గా ఇతర పార్టీల నుంచి చేర్చుకునేలా జాగ్రత్త పడుతోంది. ఇతర పార్టీల్లో అసంతృప్తులకు గాలం వేయడంతో పాటు.. ఉద్యమం సమయంలో చురుగ్గా ఉండి తర్వాత వెళ్లిన వారిని తిరిగి సొంతగూటికి ఆహ్వానిస్తున్నారు.

MLA Seats Battle In BRS : రాజుకుంటున్న అసమ్మతి.. ఆశావహుల దూకుడుతో రచ్చకెక్కుతున్న విభేదాలు

ABOUT THE AUTHOR

...view details