BRS Candidates First List of 2023 Assembly Elections : భారత రాష్ట్ర సమితి అభ్యర్థుల జాబితా సిద్ధమవుతోంది. ఈ నెల 17న ప్రారంభం కానున్న శ్రావణమాసంలో మంచి రోజున తొలి జాబితా ప్రకటించేందుకు గులాబీ దళపతి తుది కసరత్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు కొన్ని రోజులుగా అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. పలు సర్వేలతో పాటు.. సామాజిక, రాజకీయ సమీకరణలు, ఇతర పార్టీల పరిస్థితి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని అభ్యర్థులను (BRS Candidates First List) ఖరారు చేస్తున్నారు.
2018 ముందస్తు ఎన్నికలప్పుడు ఒకేసారి 105 మంది అభ్యర్థులను ప్రకటించినకేసీఆర్.. ఇప్పుడు సుమారు 80 మందికి పైగా అభ్యర్థులను తొలి జాబితాలోనే వెల్లడించే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్లో టికెట్ల కోసం తీవ్రమైన పోటీ ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు అనేక మంది నేతలు టికెట్ ఆశిస్తున్నారు. నియోజకవర్గాల్లో పోటాపోటీ కార్యక్రమాలు చేస్తూ అధిష్ఠానం దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు నేతలైతే ఎన్నికల పనులు చేసుకోవాలని తమకు అధిష్ఠానం హామీ ఇచ్చిందంటూ నియోజకవర్గాల్లో ప్రచారమే చేస్తున్నారు.
KCR to Contest from Kamareddy in Elections 2023 : కామారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా బరిలో సీఎం కేసీఆర్!
BRS Candidates First list :టికెట్ల కోసం పోటీ తీవ్రంగా ఉన్నందున వీలైనంత ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని గులాబీ నాయకత్వం భావిస్తోంది. అభ్యర్థిపై అసంతృప్తి, అసమ్మతి కనిపిస్తే సరిదిద్దుకోవడానికి, నచ్చచెప్పడానికి తగిన సమయం ఉంటుందనే ఆలోచన చేస్తోంది. పార్టీ చెప్పినా వినకపోతే వదులుకోవాలనే కఠినమైన ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెలలోనే మంచి రోజున పార్టీ అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ప్రాధాన్యం ఇస్తూనే.. కొంతమందిని మార్చే దిశగా బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపికకసరత్తు సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 103 మంది సిట్టింగ్‌ల్లో సుమారు పది, పన్నెండు మందిని మార్చవచ్చునని బలంగా వినిపిస్తోంది. పలు సర్వేల ఆధారంగా కొంతమంది ఎమ్మెల్యేలను కేసీఆర్ పిలిపించి.. వారు మార్చుకోవాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఎన్నిసార్లు చెప్పినా మారని నేతలు, తరచూ వివాదాల్లో ఉంటున్న వారిని మార్చాలని భావిస్తున్నట్లు సమాచారం.