BRS Protest Against Revanth Reddy Comments :ఉచిత విద్యుత్ రద్దుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ విమర్శించారు. 24 గంటల విద్యుత్ వెలుగుల్ని వదులుకుందామా?.. కటిక చీకట్ల కాంగ్రెస్ కాలాన్ని మళ్లీ తెచ్చుకుందామో.. ప్రజలు ఆలోచించుకోవాలని కోరారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ అని ట్విట్టర్‌లో విమర్శించిన హరీశ్‌రావు.. రైతులకు కరెంట్ వద్దన్న కాంగ్రెస్‌కు ఎన్నికల్లో షాక్ ఇవ్వాలన్నారు.
24 Hours Free Current Controversy in Telangana :రేవంత్‌రెడ్డితో కాంగ్రెస్ అధిష్ఠానం రైతులకు క్షమాపణ చెప్పించాలని మంత్రులు తలసాని, ఇంద్రకరణ్‌రెడ్డి డిమాండ్ చేశారు. 3 గంటల కరెంటు ఇస్తామని రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాలని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సవాల్ విసిరారు. రైతులకు కాంగ్రెస్ మొదటి శత్రువని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు.
జాతీయ రాహదారులపై బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో.. : సికింద్రాబాద్ కంటోన్మెంట్ తిరుమలగిరిలో ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్ మన్నె కృశాంక్ నేతృత్వంలో బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా ఐనవోలులో వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ నేతృత్వంలో ఆందోళన చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లిలో జాతీయ రహదారిపై స్థానిక ఎమ్మెల్యే శంకర్‌నాయక్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. జనగామ జిల్లా చిన్నపెండ్యాల జాతీయ రహదారిపై బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నేతృత్వంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ వ్యవసాయం 9 ఏళ్లల్లో అద్భుత ప్రగతిపథంలో నడుస్తుంటే కాంగ్రెస్ నేతల కడుపు మండుతోందని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు.