BRS Athmeeya sammelanam across State: రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు ఉత్సాహ వాతావరణంలో సాగుతున్నాయి. మండుటెండలుసైతం లెక్కచేయకుండా కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. సిద్దిపేట జిల్లా రాఘవాపూర్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. ప్రధాని మోదీ అభివృద్ధికి రాష్ట్రం సహకరించలేదంటూ చేసిన వ్యాఖ్యలపై మంత్రి మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన రూ.30,000 కోట్ల నిధులు ఆపి.. తెలంగాణ అభివృద్ధిని కేంద్రం అడ్డుకుంటోందని విమర్శించారు. సంక్రాంతికి వచ్చిపోయే వారిలా కొన్ని పార్టీల నేతలు వచ్చిపోతారని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు.
మోదీ పచ్చి అబద్ధాలు చెప్పారు: రాష్ట్ర పర్యటనలో ప్రధాని మోదీ పచ్చి అబద్ధాలు చెప్పారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలతో దూసుకెళ్తుంటే.. బీజేపీ నేతలు అక్కసుతో మాట్లాడుతున్నారని విమర్శించారు. సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో కూకట్‌పల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి పల్లా పాల్గొన్నారు. ఇతర పార్టీలా నుంచి కార్యకర్తలను బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.
కేసీఆర్ నాయకత్వంలో సంక్షేమ ఫలాలు ఇంటింటికి చేరాయి:నేలకొండపల్లిలో జరిగిన పాలేరు నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మేళనంలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రగతి ప్రదాత కేసీఆర్ నాయకత్వంలో సంక్షేమ ఫలాలు ఇంటింటికి చేరాయని.. వచ్చే ఎన్నికల్లోనూ గులాబీ పార్టీని ఆశీర్వదించాలని నేతలు కోరారు. ఖమ్మం జిల్లా పెనుబల్లిలో జరగనున్న ఆత్మీయ సమ్మేళన ఆహ్వాన కరపత్రాలను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఇంటింటికి పంపిణీ చేశారు. అనంతరం ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేంద్రంపై విమర్శలు గుప్పించారు. నల్గొండలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.