ప్రభుత్వం వెల్లడిస్తున్న కొవిడ్ మరణాల సంఖ్యపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. పరీక్షల సంఖ్య 300 ఉన్నప్పుడు, 60,000 చేసినప్పుడు కూడా మరణాల సంఖ్య మాత్రం 10కి మించకుండా చూపుతుండటంపై అనుమానాలున్నాయంది. ప్రజలకు కరోనా తీవ్రత గురించి చెప్పకుండా చీకట్లో ఉంచుతున్నారని పేర్కొంది. పరిస్థితులకు తగ్గట్లుగా సాధారణ పడకలను పెంచాల్సి ఉండగా 367 తగ్గాయని, కేవలం 831 ఆక్సిజన్, 352 ఐసీయూ పడకలను పెంచడం నామమాత్రమేనని తెలిపింది. వెంటిలేటర్లు కూడా అవసరాలకు సరిపడా లేవంది.
జనాభాకు అనుగుణంగా పరీక్షల్లేవు
రాష్ట్రంలో మొత్తం 62 కొవిడ్ ఆస్పత్రులే ఉన్నాయని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువని పేర్కొంది. కొవిడ్‌పై దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ధరణిలో ఆస్తుల నమోదు వంటి పథకాలకు శానిటరీ, ప్రజారోగ్య శాఖ సిబ్బందిని వినియోగిస్తున్నారని పిటిషనర్లు చెప్పడంతో వారిని ఇతర పనులకు మళ్లించరాదంటూ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన నివేదికను చాలా తెలివిగా రాశారని హైకోర్టు వ్యాఖ్యానించింది. పదేపదే కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూనే ఉన్నారని, ఇలాగైతే ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌పై ధిక్కరణ చర్యలు చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరించింది. వాస్తవాలను వెల్లడిస్తామని ప్రధాన కార్యదర్శి చెప్పడంతో హాజరు నుంచి మినహాయింపునిచ్చామని, ఇలాగైతే మళ్లీ పిలిపించాల్సి ఉంటుందని పేర్కొంది. గత ఆదేశాల్లో పరీక్షల సంఖ్యను ఎందుకు తగ్గిస్తున్నారో చెప్పమన్నా, తెలివిగా సగటు తగ్గలేదని పేర్కొన్నారంటూ అసంతృప్తి వ్యక్తంచేసింది. పరీక్షలు ఉన్నట్లుండి 62 వేల నుంచి 30 వేలకు పడిపోతున్నాయని, కారణమడిగితే.. ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాస్‌రావు సెలవులు కావడంతో తగ్గాయంటున్నారని పేర్కొంది. సాధారణంగా సెలవు రోజుల్లోనే ప్రజలు బయటకు ఎక్కువగా వెళ్తుంటారని, పరీక్షలకు రావడంలేదనడం సరికాదంది. బతుకమ్మ, దసరా, దీపావళి సందర్భంగా ప్రజలు ఎక్కువ గుమికూడతారని, రెండోసారి దీని ప్రభావం ఉంటుందని శ్రీనివాస్‌రావు అంగీకరించినా ఆశ్చర్యకరంగా అందుకు తగిన ఏర్పాట్లు మాత్రం జరగలేదంది.