మద్యపాన ప్రియులా.. అయితే చదవండి
మితిమీరిన మద్యం సేవించడం వల్ల మెదడు దెబ్బతినే అవకాశం ఉందని.. భవిష్యత్‌లో అది మనిషిని సైకలాజికల్‌గా దెబ్బతీస్తుందని భారత సంతతికి చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు.
ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ సేవించడం ద్వారా మెదడులోని అమైగ్డాలా నాడుల్లో ఎపిజెనెటిక్ సమస్యలు తలెత్తుతాయని యూఎస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినోయిస్ పరిశోధకులు అంటున్నారు. అమైగ్డాలా అనేది కోపం, ఆతృత, భావోద్వేగాలకు సంబంధించిన మెదడులోని ప్రాంతం. జన్యు కణాల్లోని క్రోమోజోమ్‌లో ఉండే డీఎన్ఏ, ఆర్ఎన్ఏ, ఇతర ప్రోటీన్లలో రసాయన మార్పులనే ఎపిజెనెటిక్ అంటారు.
ఎపిజెనెటిక్ మార్పులు అనేవి సహజంగా మెదడు అభివృద్ధిలో పాలుపంచుకుంటాయి. ఆల్కహాల్, ఒత్తిడి వంటివి మెదడు అభివృద్ధిని ప్రభావితం చేస్తాయని యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినోయిస్ ప్రొఫెసర్ సుభాష్ పాండే తెలిపారు.
21 ఏళ్ల లోపు మద్యం తాగడం మొదలెట్టిన 11 మందిని, 21 ఏళ్ల తర్వాత మద్యానికి బానిసైన 11 మందిని.. మొత్తం 22 మంది మెదడులోని కణజాలాన్ని పరీక్షించడం ద్వారా వారు ఈ సమస్యకు గురయ్యారని నిర్ధారణకు వచ్చారు. పరిశోధన ప్రకారం మద్యం తాగని వారి సగటు ఆయుర్ధాయం 58 ఏళ్లు కాగా, చిన్న వయస్సులోనే ఆల్కహాల్‌కు బానిసైవారి ఆయుర్ధాయం 55 ఏళ్లు, ఆలస్యంగా తాగడం మొదలెట్టిన వారి సగటు జీవితకాలం 59 ఏళ్లని కనుగొన్నారు.
మెదడులోని కణజాలాల్లో బీడీఎన్ఎఫ్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది మెదడు అభివృద్ధిలో తోడ్పడుతుంది. తక్కువ వయస్సులో మద్యం సేవించడం ప్రారంభించిన వారిలో బీడీఎన్ఎఫ్కి బదులు బీడీఎన్ఎఫ్-ఏఎస్ అనే ప్రోటీన్ ఉన్నట్లు గుర్తించారు. బీడీఎన్ఎఫ్-ఏఎస్ వల్ల మెదడు అభివృద్ధిలో సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు.
లేత వయసులో ఆల్కహాల్ బానిసయ్యే వారి మొదడులోని అమైగ్డాలాలో మార్పులు సంభవించి అవి మానవుని భావోద్వేగాలను అదుపుతప్పేలా చేస్తాయని అంటున్నారు పరిశోధకులు.