ఎంసెట్లో మరోసారి అబ్బాయిలు పైచేయి సాధించారు. ఈ ఏడాది లక్ష 19 వేల 183 మంది ఎంసెట్ రాయగా.. వారిలో 75.29 శాతంతో 89 వేల 734 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 48 వేల 781 మంది ఉత్తీర్ణులు కాగా.. బాలికలు 31 వేల 947 మంది ర్యాంకులు సాధించారు. మైనారిటీలు 7 వేల 530 మంది రాయగా.. 52.81 శాతంతో 5 వేల 120 మంది ఉత్తీర్ణత సాధించారు.
ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులు 89 మంది 121 నుంచి 160 మార్కులు.. 3 వేల 293 మంది 81 నుంచి 120 మార్కులు... 77 వేల 629 మంది 40 నుంచి 80 మధ్య మార్కులు సాధించారు. సీబీఎస్ఈ చదివిన విద్యార్థుల్లో 28 మంది 121 నుంచి 160 మార్కులు... 111 మంది 81 నుంచి 120 మార్కులు... 1,172 మంది 40 నుంచి 80 మధ్య మార్కులు సాధించారు.
మార్కుల వారీగా...
ప్రభుత్వ కాలేజీల్లో ఇంటర్ చదివిన విద్యార్థులు 8 వేల 799 మంది ఎంసెట్ రాయగా... వారిలో 6 వేల 46 మంది ఉత్తీర్ణత సాధించారు. అత్యధికంగా 4 వేల 939 మంది 40 నుంచి 80 మధ్య మార్కులే సాధించారు. కేంద్రీయ విద్యాలయాల్లో చదివిన విద్యార్థులు 409 రాయగా.. 179 ఉత్తీర్ణత సాధించారు. వారిలో 284 మంది 80లోపు మార్కులే సాధించారు. మొత్తం అర్హత సాధించిన 80 వేల 728 మందిలో 79 వేల 201 మందికి 80లోపు మార్కులే వచ్చాయి.
హైదరాబాదీకి మొదటి ర్యాంక్...
ఈ ఏడాది మొదటి పది ర్యాంకులు బాలురే సాధించారు. ఐదు తెలంగాణ, మరో ఐదు ఏపీ విద్యార్థులు దక్కించుకున్నారు. హైదరాబాద్ విద్యార్థి సాయితేజ వారణాసి 147 మార్కులతో మొదటి ర్యాంకు సాధించగా.. ఏలూరు విద్యార్థి కాపెల్లి యశ్వంత్ సాయి రెండో ర్యాంకు దక్కించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం విద్యార్థి తమ్మనబోయిన మణివెంకట కృష్ణ మూడో ర్యాంకు, హైదరాబాద్ విద్యార్థులు సీహెచ్ కౌశల్ కుమార్ రెడ్డి నాలుగో ర్యాంకు, హార్ధిక రాజ్ పాల్ ఐదో ర్యాంకు సాధించారు.