Boy Talent in Astrology: పూర్వీకుల వారసత్వాన్ని కొనసాగిస్తూ పదేళ్లకే ఆ బుడతడు జ్యోతిష్యాన్ని ఔపోసన పట్టాడు. పిట్టకొంచెం కూత ఘనం అన్న సామెతను గుర్తు చేస్తూ.. అతిపిన్న వయస్సులోనే డాక్టరేట్ సాధించి అరుదైన ఘనత సాధించాడు. జ్యోతిష్య శాస్త్రంలో పదుల వయస్సుల వారికి అనుభవం ఉన్న వారికి సాటిగా.. ఈ బుడతడు తన ప్రతిభను చూపిస్తున్నాడు చదువుతో పాటు జ్యోతిష్యంలోనూ పట్టు సాధిస్తున్న ఆంధ్రప్రదేశ్ గుంటూరు చిన్నోడు యోగానందశాస్త్రిపై ప్రత్యేక కథనం.
చిన్న వయసులో చదువుతోపాటు జ్యోతిష్యంపై పట్టు సాధించాడు ఈ బుడతడు. గుంటూరు బ్రాడీపేటకు చెందిన అరిపిరాల యోగానంద శాస్త్రి స్థానిక ప్రైవేటు పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్సు సంస్థ ఈ చిన్నోడికి గ్లోబల్ అవార్డుతోపాటు గౌరవ డాక్టరేట్ అందించింది. జ్యోతిష్యంలో విధానాలన్నింటినీ ఆకళింపు చేసుకున్న ఈ బుడతడు జ్యోతిష్యశాస్త్రంలో.. తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నాడు. ప్రపంచ మానవ హక్కుల పరిరక్షణ కమిషన్ యోగానందశాస్త్రికి డాక్టరేట్ ప్రకటించింది. ఇటీవల దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ చిన్నోడు డాక్టరేట్ అందుకున్నాడు.