ఎవరి కుటుంబంలోకైనా కొత్తగా పాపాయి వస్తోందంటే ఆ సంతోషమే వేరు. అలాంటి శుభసందర్భంలో ఆత్మీయులను కలవడానికి వెళ్లేటప్పుడు బోసి నవ్వుల చిన్నారుల కోసం కానుకలు తీసుకెళ్లడం సహజమే. అయితే, అప్పుడే పుట్టిన పిల్లలు కాబట్టి బొమ్మలతో ఆడుకునే వయసు కాదు. పైగా అందరూ బొమ్మలే తెచ్చినా వృథానే. అందుకే, చిన్నారులకు వేసే దుస్తులూ న్యాప్‌కిన్లూ బుల్లిబుల్లి దుప్పట్లూ పాల బాటిళ్లలాంటివాటిని తీసుకెళ్తుంటాం. అక్కడవరకూ బాగానే ఉందికానీ ఆ దుస్తుల్ని షాపు నుంచి కొని అలా కవర్లతో ఇచ్చేయడమే అంతగా బాగుండదు. అందుకే, ఇప్పుడు చాలా ఆన్‌లైన్ కంపెనీలు పసిపిల్లలకు కానుకగా ఇచ్చే దుస్తులూ ఇతర వస్తువుల్ని ఓ సెట్‌గా అమ్మడంతో పాటు, వాటిని చూడచక్కని బొకేలానూ పూల బుట్టల్లానూ తయారుచేసి ఇస్తున్నాయి. వీటిని అమ్మానాన్నలకు ఇస్తే బొకే ఇచ్చి వారికి శుభాకాంక్షలు చెప్పినట్లూ ఉంటుంది. అందులోనే చిన్నారికి కానుకలూ ఉంటాయి.
బుజ్జి పాపాయిలకు ఆకర్షణీయమైన 'వస్త్రాల బొకే' కానుక.!
మామూలుగా ఎవరికైనా శుభాకాంక్షలు తెలపాలంటే బొకే తీసుకెళ్తాం. మరి పాపాయి పుట్టిన సందర్భంగా అమ్మానాన్నలకు శుభాకాంక్షలు తెలిపితే చాలదుగా. బోసి నవ్వుల చిన్నారిక్కూడా ఏదో చిరుకానుక ఇవ్వాల్సిందే. ఆ రెండూ కలసి వస్తున్నవే ఈ ‘బేబీ క్లాత్ గిఫ్ట్ బొకే’లు.
అన్నీ బొకేలోనే!
ఈ ‘బేబీ క్లాత్ బొకే’లు చూడ్డానికి మామూలు బొకేల్లానే అందంగా ఉంటాయి. అలా కనిపించేలా షర్టులూ ప్యాంటులూ న్యాప్‌కిన్‌లను పువ్వుల్లా చుడతారు. బొకేను చూసి అందులో ఏం ఉంటాయో తెలియకుండా ఆర్డరిచ్చేయలేం కదా.. అని ఆలోచించనక్కర్లేదు. దాన్లో ఏమేం ఉంటాయో ఆ ఫొటోలూ వివరాలూ మనకి కనిపిస్తాయి. ఈ సెట్‌లలో రెండు మూడు జతల దుస్తులతో పాటు, షూ, సాక్సులూ, గ్లవ్‌జులూ, టోపీలూ, న్యాప్‌కిన్లూ, బుల్లి బుల్లి దుప్పట్లూ, పాల బాటిళ్లూ, బొమ్మలూ, డైపర్లూ... ఇలా రకరకాలవి ఉంటాయి. ప్రతి సెట్టూ భిన్నంగా ఉంటుంది. ఆడపిల్లలవీ మగపిల్లలవీ విడివిడిగా దొరుకుతాయి. మనకి నచ్చినదాన్ని ఎంపికచేసుకుని ఆర్డరిస్తే, వాటిని అందంగా పేర్చి, బొకేను తయారుచేసి పంపిస్తారు. ఇంకేముందీ... ఆ బేబీ క్లాత్ బొకేను అలాగే తీసుకెళ్లి ఆత్మీయులకు అందమైన సర్‌ప్రైజ్‌ని ఇవ్వొచ్చు. ఫ్లవర్ బొకేలు అయితే, రెండు రోజుల తర్వాత పనికిరావు. కానీ ఇవి పాపాయికి చాలారోజులు చక్కగా ఉపయోగపడతాయి కదా..!
ఇదీ చదవండి:ఉపాధ్యాయుల కొరతను అధిగమించేదెలా?