తెలంగాణ

telangana

ETV Bharat / state

కార్పొరేట్‌ ఆస్పత్రికి ధీటుగా.. జాతీయ అవార్డుకు ఎంపికైన సర్కార్ దవాఖానా - జాతీయ అవార్డుకి బోరబండ యూపీహెచ్​సీ

National Award for Borabanda UPHC: చుట్టూ మురుగు, దుర్గంధం.. ఎక్కడపడితే అక్కడ పేరుకున్న చెత్త.. ఒకప్పుడు సర్కారు దవాఖానా అంటే ఆ దృశ్యాలే కళ్లముందు కదలాడేవి. ఇప్పుడు.. ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ వైద్యం పొందే హక్కుఉందని... ప్రభుత్వాస్పత్రి అంటే కేవలం మందులు ఇవ్వడమే కాదు నాణ్యమైన సేవలు అందిస్తోంది... హైదరాబాద్‌ బోరబండలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. మంచి సేవలు అందిస్తూ జాతీయ గుర్తింపును సొంతం చేసుకుంది.

National Award for Borabanda
National Award for Borabanda

By

Published : Dec 4, 2022, 8:37 PM IST

కార్పొరేట్‌ ఆస్పత్రికి ధీటుగా.. జాతీయ అవార్డుకు ఎంపికైన సర్కార్ దవాఖానా

National Award for Borabanda UPHC: జ్వరమొస్తే మందులు ఇవ్వడం, నొప్పులకు సూదిమందు. వివిధ రకాల వ్యాధులతో.. ఆస్పత్రికి వచ్చే వారికి నాణ్యమైన, ఇన్‌ఫెక్షన్‌ రహిత వైద్యసేవలతోపాటు రోగికి సంతృప్తికరమైన సేవలందించడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది బోరబండలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. రోగులకు మంచినీరు సహా అవసరమైన అన్నిరకాల పరీక్షలు ఉచితంగా చేయటం సహా... రోగి సహాయకులు కూర్చుకునేందుకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నారు. చిన్నారులకు సమయానుకూలంగా టీకాలు అందించడంతోపాటు అన్ని రకాల జాతీయ ఆరోగ్య మిషన్ పథకాలు అమలు చేస్తూ ఔరా అనిపిస్తోంది.

ఈ యూపీహెచ్​సీలోకి అడుగుపెడితే ప్రశాంత వాతావరణం రోగికి స్వాంతన కలిగిస్తుంది. నిత్యం వందకు పైగా మంది ఓపీ సేవలకోసం వస్తున్నా.. అందరికీ క్యూలైన్లు, పరీక్షాకేంద్రాలు సహా ఏ వైద్యం ఎక్కడ అందిస్తారో చెప్పే ప్రత్యేక సూచికా బోర్డులు ఏర్పాటు చేశారు. బాలింతలు ఆస్పత్రికి వస్తే చిన్నారులకు పాలిచ్చేందుకు ప్రత్యేక గదులు ఏర్పాటుచేశారు. వాటితోపాటు ఆస్పత్రి ప్రాంగణంలోని మెడిసినల్ ప్లాంట్స్‌, గార్డెన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

వివిధ వ్యాధులతో బాధపడేవారు.. నిత్యం గార్డెన్‌లో కాసేపు సేద తీరుతుంటారు. మధుమేహ రోగులకు కావాల్సిన మందులు అందించటం సహా ఆయుష్ వైద్యం అందిస్తున్నారు. ఆస్పత్రి ప్రాంగణాన్ని నిత్యం పరిశుభ్రంగా ఉంచటం, సిరంజీలు, నీడిల్స్ సహా మెడికల్‌ వ్యర్థాలు సరిగ్గా డిస్పోజ్ చేయటం వంటివి చేస్తున్నారు. మెరుగైన సేవలు అందిస్తుండటంతో ఇటీవలే కేంద్రప్రభుత్వం ప్రకటించిన క్వాలిటీ అష్యురెన్స్ స్టాండర్డ్స్ అవార్డుకు ఎంపికైంది బోరబండ యూపీహెచ్​సీ.

'మేము ఇక్కడికి 20 సంవత్సరాలుగా వస్తున్నాం. చాలా బాగా చూస్తారు. లాక్​డౌన్​ నుంచి ఇక్కడికి రావడం ఎక్కువ అయింది. ప్రైవేటు కంటే నీట్​గా ఈ ఆస్పత్రి ఉంటుంది. కార్పొరేట్ దవాఖానా కంటే మంచిగా వైద్య సేవలు అందిస్తున్నారు. ఇక్కడ సిబ్బంది అందరూ వైద్యం కోసం వచ్చే రోగులను బాగా చూసుకుంటారు. ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చిన తక్షణమే చికిత్స అందిస్తారు. ఆసుపత్రికి వచ్చే వారి వద్ద ఏ విధమైన డబ్బు తీసుకోకుండా వైద్యం చేస్తారు.'-రోగులు

కార్పొరేట్‌ స్థాయిలో సదుపాయాలు, సేవలు అందిస్తున్నారంటూ ఇక్కడి వచ్చే రోగులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నేషనల్ క్వాలిటీ అష్యురెన్స్ స్టాండర్డ్స్ అవార్డుకు ఎంపిక కావటంతో తమపై మరింత బాధ్యత పెరిగిందని ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. రోగులకు మరింత మెరుగైన సేవలందించేందుకు అనునిత్యం కృషిచేస్తామంటున్న ఆస్పత్రి సిబ్బంది పనితీరు మరెన్నో దవాఖానాలకు ఆదర్శంగా నిలుస్తోంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details