Book Reading Benefits: పుస్తక పఠనంతో వైద్యం చేయడం అసాధారణం కాదు. విదేశాల్లో అమలులో ఉన్న ఈ పద్ధతిని ‘బిబ్లియోథెరపీ (గ్రంథ చికిత్స)’ అంటారు. మానసిక వైద్యంలో ఇది కూడా ఒక భాగం. ఆందోళన, నిరాశ, దుఃఖంతో బాధపడడం వల్ల శరీరంలో పలురకాల హానికారక క్రియలు జరిగి అనారోగ్యాలకు దారితీస్తాయి. వీటికి విరుగుడుగా.. పుస్తకాలు చదివితే.. వాటిలోని సారాంశం ద్వారా సమాచారం, మద్దతు, మార్గదర్శకత్వం లభించి జీవనశైలి మెరుగుపడుతుంది. ఆయా ఇతివృత్తాల్లో పాఠకులు తమను తాము ఊహించుకోవడం ద్వారా ఉపశమనం పొందుతారు. కొన్ని విషయాలను వారి వ్యక్తిగత జీవితాలకూ అన్వయించుకుని మనోనిబ్బరం సాధించేందుకు వీలుంటుంది.
దివ్య ఔషధం
గతంలో యువకుల నుంచి వృద్ధుల వరకూ చదువొచ్చిన వారి చేతుల్లో పుస్తకాలు కనిపించేవి. ప్రయాణాల్లో, తీరిక సమయాల్లో ప్రశాంతంగా పుస్తకాలు చదువుకునేవారు. ఈ అలవాటుకు టీవీలు బ్రేకులు వేస్తే.. తర్వాత వచ్చిన సెల్‌ఫోన్లు ఏకంగా అడ్డుకట్టలే కట్టేశాయి. ఈ పరిస్థితులే అనేక ఒత్తిడులకు కారణమవుతున్నాయని, వాటికి మంచి పుస్తక పఠనం దివ్య ఔషధం అని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు.
6 నిమిషాల పఠనంతో 60 శాతం ఒత్తిడి మాయం
ప్రతిరోజు కనీసం ఆరు నిమిషాలు పుస్తకం చదివితే హృదయ స్పందనతో పాటు కండరాలపై ఒత్తిడిని 60 శాతం వరకు తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. సంగీతం, టీ తాగడం, నడక, వీడియోగేమ్‌లు ఆడడం వంటి వాటి కంటే.. ఒత్తిడిని ఎదుర్కోవడానికి పుస్తకపఠనం మంచిదని యూకేలోని ‘ససెక్స్’ విశ్వవిద్యాలయం గతంలో నిర్వహించిన పరిశోధనలో తేలింది. రక్తపోటు, హృదయ స్పందనరేటు, మనోవేదన.. పుస్తక పఠనం ద్వారా వేగంగా తగ్గుతాయని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ నిర్వహించిన పరిశోధన వెల్లడించింది. ప్రపంచ చరిత్ర, క్లాసిక్ నవలలు, లేదా థ్రిల్లర్.. ఏదైనా కావచ్చు. ప్రతి పఠనం మెదడుకు ఔషధం అని నిపుణులు సూచిస్తున్నారు.
"ఎవరి పని ఒత్తిడిలో వారున్న సమయంలో మాట్లాడేవారే కరవైపోయారని కుంగిపోకుండా.. పుస్తకం అమ్మలా లాలిస్తుంది. నాన్నలా ధైర్యాన్నిస్తుంది. గురువులా బోధిస్తుంది. మార్గదర్శి అవుతుంది. ముఖ్యంగా ఒంటరితనంలో స్నేహితుడై ఓదార్పునిస్తుంది. పుస్తకం దీపంలా వెలుతురునిచ్చి మనోమాలిన్యమనే చీకటిని తొలగిస్తుంది."
-- - డా.బి.ఆర్.అంబేడ్కర్
కాలక్షేపం కాదు.. మార్గదర్శనం
- పుస్తకాలు చదవడం కాలక్షేపం కాదు. పఠనంతో మానసిక పరిధి విస్తరిస్తుందని రకరకాల పరిశోధనలు తేల్చి చెప్పాయి. లక్ష్యాన్ని నిర్దేశించుకునే స్పృహతో పాటు సాధించాలనే పట్టుదల పెరుగుతుంది. బాల్యం నుంచే పుస్తక పఠనం అలవాటు చేయాలి.
- పుస్తకాలు చదవని వారితో పోలిస్తే.. చదివే వారు లోకజ్ఞానంలోనే కాదు.. రకరకాల సామర్థ్యాలలోనూ మెరుగైన ప్రతిభ కలిగి ఉన్నారని బ్రిటన్‌లోని నేషనల్ లిటరసీ ట్రస్ట్ సర్వేలో తేలింది.
- పుస్తకాలు చదవడం వల్ల విజ్ఞానంతోపాటు మంచి నడవడిక అలవడుతుంది. క్రమం తప్పకుండా పుస్తకం చదివే వ్యక్తి మానసిక ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉంటారు. పదిమందిలో ఆకర్షించేలా మాట్లాడే నైపుణ్యంతో పాటు.. విషయ పరిజ్ఞానంతో మాట్లాడతారు. చర్చలలో వాదన నైపుణ్యం పెరుగుతుంది. క్లిష్టమైన సమస్యలకు సులువైన పరిష్కారాలను గుర్తించగలుగుతారు.
సర్జన్‌గా సుదీర్ఘ అనుభవం ఉన్న ఓ వైద్యుడు.. ఆరోగ్య సమస్యల కారణంగా మానసిక బలహీనతకు లోనయ్యారు. ఆయనలో ఎన్నడూ చూడని కోపం, విసుగు, చిరాకు మొదలైంది. నిద్రపోవడం, ఉదయం లేవడమూ కష్టంగా మారింది. దీంతో ఆసుపత్రికి వెళ్లడం, ఆపరేషన్లు చేయడం కూడా క్లిష్టంగా అనిపించేవి. మిత్రులు, కుటుంబ సభ్యులు మాట్లాడినా పెద్దగా ఫలితం కనిపించలేదు. ఆ తర్వాత నిర్దిష్ట దినచర్య, పుస్తక పఠనం.. ఆయన్ను మళ్లీ మామూలు మనిషిని చేసింది.