తెలంగాణ

telangana

ETV Bharat / state

నేటి నుంచి గోల్కొండ కోటలో ఆషాఢమాస బోనాలు - bonal in telangana

ఆషాఢమాసంలో ప్రతి సంవత్సరం జరిగే బోనాల ఉత్సవాలు గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబికా అమ్మవారి ఆలయంలో ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో ఉత్సవాలు ఇక్కడే ప్రారంభమై.. చివరగా ఇక్కడే ముగుస్తాయి. కరోనా దృష్ట్యా ఈ ఏడాది నిరాడంబరంగా పది మంది అర్చకులతో ఉత్సవాలు నిర్వహించేందుకు దేవాదాయశాఖ నిర్ణయించింది.

bonal in telangana started at golconda
నేటి నుంచి గోల్కొండ కోటలో ఆషాఢమాస బోనాలు

By

Published : Jun 25, 2020, 10:18 AM IST

ఆషాఢమాసంలో నిర్వహించే బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఏటా గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబికా అమ్మవారి ఆలయంలో ఉత్సవాలు ప్రారంభమైన తర్వాత సికింద్రాబాద్‌, పాతబస్తీతో సహా ఇతర ప్రాంతాల్లో జరగడం ఆనవాయితీ. ఇక్కడ 9 వారాలపాటు ఉత్సవాలు జరుగుతాయి. తెలంగాణలో బోనాల ఉత్సవాలు గోల్కొండ కోటలో ప్రారంభమై చివరకు ఇక్కడే ముగుస్తాయి. ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు దేవాదాయశాఖ కార్యనిర్వహణాధికారి మహేందర్‌కుమార్‌ తెలిపారు.

నిరాడంబరంగా..

కరోనా మహమ్మారి కారణంగా ఈ సంవత్సరం బోనాల ఉత్సవాలను నిరాడంబరంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. గురువారం లంగర్‌హౌస్‌లో అమ్మవారి చిత్రపటం, తొట్టెలకు పూజలు నిర్వహిస్తారు. అనంతరం అక్కడి నుంచి తొట్టెలను గోల్కొండ ఛోటాబజార్‌లోని పూజారి అనంతాచారి ఇంటికి తీసుకువస్తారు. అక్కడ ప్రత్యేక పూజలు, అభిషేకాలు అందుకున్న అమ్మవారి విగ్రహాన్ని తొట్టెలతోపాటు కోటపైన ఉన్న ఆలయానికి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

ఈ సంవత్సరం ఊరేగింపు, డప్పువాయిద్యాలు, బ్యాండు మేళాలు, పోతరాజుల నృత్యాలు లేకుండా ఉత్సవాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. ఉత్సవాలకు పోలీసులు కేవలం 10 మందిని మాత్రమే అనుమతించారు. ఆలయ పూజారి, దేవాదాయశాఖ అధికారులు, ఆలయ వృత్తిపనివారు బోనాల ఉత్సవాలను నిర్వహిస్తారు. ఉదయం 8 గంటలకు పూజాకార్యక్రమాలు ఆరంభంకాగా మధ్యాహ్నం 12 గంటల్లోపు అమ్మవారి విగ్రహాన్ని ఆలయానికి తరలిస్తామని ఈవో మహేందర్‌కుమార్‌ తెలిపారు. అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించడం లేదు.

ABOUT THE AUTHOR

...view details