వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం నుంచి లింగం అనే వ్యక్తి తన కుటుంబంతో సహా హైదరాబాద్ వచ్చారు. ఎంజీబీఎస్‌లో బస్సు దిగి ఆటోలో తన బంధువుల ఇంటికి బయలుదేరారు. బోయిన్పల్లి వచ్చిన వెంటనే హడావుడిగా ఆటో దిగారు. కానీ ఆటోలో తమతో పాటు తెచ్చుకున్న బట్టల బ్యాగు, డబ్బులు నగలు ఉన్న బ్యాగును మర్చిపోయారు. కాసేపటి తర్వాత తేరుకున్న లింగం... లబోదిబోమన్నాడు. వెంటనే బోయిన్పల్లి పోలీసులను ఆశ్రయించాడు.
డబ్బు, నగలున్న బ్యాగు ఆటోలో మరిచిపోయాడు.. ఆ తర్వాత! - బోయిన్పల్లి పోలీసుల చాకచక్యం
వరంగల్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఆటోలో... డబ్బు, నగలు ఉన్న తన బ్యాగును మర్చిపోయి వెళ్లాడు. కాసేపటికి తేరుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. చాకచక్యంగా వ్యవహరించి పోలీసులు.. బాధితుడికి బ్యాగు చేరవేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు... సీసీ కెమెరాల ఆధారంగా బాధితులు వచ్చిన ఆటోను పట్టుకున్నారు. డ్రైవర్‌ను నిలదీయగా... తనకేమీ తెలియదని చెప్పాడు. పోలీసులు ఆటోలో వెతకగా... సీటు వెనకాల భాగంలో బాధితుల బ్యాగు కనిపించింది. బ్యాగును బాధితులకు అప్పగించి అందులో అన్నీ ఉన్నాయో లేవో చూసుకోమన్నారు. డబ్బు, నగలు బ్యాగులోనే ఉండటం వల్ల బాధితులు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుళ్లను... ఇన్స్పెక్టర్ అంజయ్య అభినందించారు.
ఇవీ చూడండి:మారుతీరావు అంత్యక్రియలకు అమృత దూరం...!