తెలంగాణ

telangana

ETV Bharat / state

రక్త దానం... ప్రాణ దానం! - రక్తదానం రక్త నిల్వలు

లాక్‌డౌన్‌తో జీవిక కోల్పోయి రోడ్డునపడ్డ నిరుపేదల కడుపులు నింపడానికి ఎందరో దాతలు ముందుకొచ్చారు. అన్నం వండిపెట్టారు, నిత్యావసరాలు పంచి పెట్టారు. ఇళ్లల్లో ఒంటరిగా ఉంటున్న వృద్ధులకు బాసటగా కొందరు నిలిస్తే, మానసిక ఆందోళనలతో సతమతమయ్యేవారికి ఫోనులోనే సాంత్వన పలికారు మరికొందరు. అంతా బాగానే ఉంది... కానీ మరో దానాన్ని మాత్రం మరిచేపోయారు. రక్తం నిల్వలు నిండుకున్నాయంటూ బ్లడ్‌ బ్యాంకులు నోరు తెరిచి అడిగేదాకా ఆ విషయం ఎవరికీ గుర్తురాలేదు. పత్రికలో వార్త చూసి సాక్షాత్తూ హైకోర్టు న్యాయమూర్తే స్పందించారు. స్వయంగా వెళ్లి రక్తదానం చేశారు. ఆయనను చూసి మరో ముగ్గురు... అలా మరికొందరు పూనుకోవటంతో ప్రస్తుతానికి గండం గట్టెక్కింది. అయితే ఇది ఇవాళ్టి కొత్త సమస్య కాదంటున్నాయి అధ్యయనాలు.

రక్తదానం... ప్రాణదానం!
రక్తదానం... ప్రాణదానం!

By

Published : May 3, 2020, 4:44 PM IST

హైదరాబాద్‌కి చెందిన వాసుదేవ్‌ ఎనిమిదేళ్ల కుమార్తె తలసేమియా బాధితురాలు. పదిహేను రోజులకొకసారి ఆమెకి రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. లాక్‌డౌన్‌ మొదలయ్యాక బిడ్డకోసం రక్తం సంపాదించే సరికి ఆ తండ్రికి చుక్కలు కనపడ్డాయి. ఎప్పుడూ వెళ్లే బ్లడ్‌ బ్యాంకుతో సహా మరో మూడు బ్లడ్‌బ్యాంకులు వాళ్లకు కావాల్సిన గ్రూపు రక్తం లేదని చేతులెత్తేశాక ఏం చేయాలో తెలియని ఆ తండ్రి సోషల్‌ మీడియాలో స్నేహితులను అభ్యర్థించాడు. మూడు రోజులపాటు ఎందరినో సంప్రదించాక చివరికి ఓ వ్యక్తి పోలీసుల అనుమతి తీసుకుని సొంత వాహనంలో తానే వచ్చి రక్తం ఇచ్చి వెళ్లగలనని హామీ ఇచ్చాక వాసుదేవ్‌ ఊపిరి పీల్చుకున్నాడు.

మార్చిలో లాక్‌డౌన్‌ మొదలయ్యాక వారం పది రోజులకల్లా బ్లడ్‌ బ్యాంకుల్లో నిల్వలు తగ్గిపోవడం మొదలైంది. పెద్ద పెద్ద రక్త నిధుల్లో రోజూ వంద మందికి పైగా రక్తదానం చేస్తే, చిన్న చిన్న వాటిల్లోనూ రోజుకు ఐదారుగురైనా వచ్చి రక్తం ఇచ్చేవారు. లాక్‌డౌన్‌ వల్ల దాతలెవరూ రాకపోవడంతో ఒక్కసారిగా సేకరణ జీరో అయిపోయింది. ఒకప్పుడు నెలకు 500 యూనిట్లు సరఫరా చేసే బ్లడ్‌ బ్యాంకులు కూడా 150 యూనిట్లు మాత్రమే సరఫరా చేయగలిగాయి. దాంతో అత్యవసరమైన కేసులకు మాత్రమే రక్తం ఇవ్వడం మొదలెట్టాయి. అరుదైన గ్రూపుల రక్తం అయితే పూర్తిగా అందుబాటులో లేకుండా పోయింది. దీనివల్ల తలసేమియా బాధితులూ డయాలిసిస్‌ అవసరం ఉన్నవారూ చాలా ఇబ్బందులు పడ్డారు.

అయితే సమస్య మరీ తీవ్రం కాకముందే బ్లడ్‌ బ్యాంకుల నిర్వాహకులూ స్వచ్ఛంద సంస్థలూ సమయానికి స్పందించి సమస్యను అధికారుల దృష్టికి తేవడంతో వెంటనే రక్తదానానికి ఏర్పాట్లు జరిగాయి. రక్తదాతల్ని పోలీసు వాహనాల్లో తీసుకెళ్లి తిరిగి ఇంటి దగ్గర దింపే ఏర్పాటుచేయడంతో చాలామంది ముందుకు వచ్చారు. దాంతో హైదరాబాదులో బ్లడ్‌బ్యాంకులన్నీ పూర్తిగా కాకపోయినా కొంతవరకూ సర్దుబాటు చేసుకోగలిగాయి. కానీ మిగిలిన నగరాల్లో అలా జరగలేదు.

రక్త దానం... ప్రాణ దానం!

కొరత ఉంది!

కోల్‌కతాలో నివసించే ఇరవై ఏడేళ్ల శ్రేయ కూడా తలసేమియా బాధితురాలే. ఏప్రిల్‌ మొదటివారంలో తాను ఎప్పుడూ వెళ్లే బ్లడ్‌బ్యాంకుకు వెళ్తే లాక్‌డౌన్‌ వల్ల దాతలు ఎవరూ రాలేదనీ ఆమె గ్రూపు రక్తం లేదనీ చెప్పారు. దాంతో కంగారుపడిన శ్రేయ వరసగా నగరంలో ఉన్న బ్లడ్‌ బ్యాంకులన్నిటికీ ఫోన్లు చేసింది. రెండు రోజులు ఆందోళనతో నిద్రలేని రాత్రులు గడిపాక చివరికి పరిచయస్తుల ద్వారా ప్రయత్నిస్తే ఓ బ్లడ్‌ బ్యాంకు నిర్వాహకులు ఆమె కోసం ప్రత్యేకంగా దాతను పిలిపించి రక్తం ఏర్పాటుచేశారు. ముంబయి, దిల్లీ లాంటి నగరాల్లో శ్రేయ లాంటి వాళ్లెంతమందో సమయానికి రక్తం దొరక్క ఆందోళన చెందారు. చిన్న చిన్న పట్టణాల్లో అయితే డయాలిసిస్‌ రోగులు రక్తం దొరక్క ప్రాణాలు కోల్పోయిన వార్తలూ వచ్చాయి.

వారాల తరబడి లాక్‌డౌన్‌ అనేది అందరికీ కొత్తే. దాని పరిణామాలపై ఎవరికీ అవగాహన లేదు. దాంతో బ్లడ్‌ బ్యాంకులూ సమస్యని ముందుగా ఊహించలేకపోయాయి. ఇంటినుంచి బయటకు వెళ్లడానికి అనుమతి లేకపోవడంతో రక్తదాతలూ ఊరకుండిపోయారు. ఆస్పత్రుల్లో కరోనా పేషెంట్లుంటారేమోనన్న భయమూ దానికి తోడవటంతో ఎప్పుడూ రక్తదానం చేసేవారు కూడా గత రెండు నెలల్లో రక్తదానం చేయడానికి వెనకాడారు. ఫలితంగా చాలా చోట్ల రక్తం కొరత ఏర్పడింది. కాకపోతే కరోనా వైరస్‌ బాధితులకు తప్ప మరే ఇతర చికిత్సలూ, శస్త్రచికిత్సలూ జరగకపోవటం వల్లా రోడ్డు ప్రమాదాలు లేకపోవడం వల్లా రక్తం అవసరం పెద్దగా రాక సమస్య గురించి అంతగా ఎవరికీ తెలియలేదు. అయితే రక్తం నిల్వల సమస్యకి లాక్‌డౌన్‌ కూడా పూర్తి కారణం కాదనిపిస్తోంది. ఎందుకంటే లాక్‌డౌన్‌ ప్రకటించడానికి మూడు రోజుల ముందే మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి ఓ సందర్భంలో మాట్లాడుతూ రక్తం నిల్వలు లేవనీ, దాతలు ముందుకు రావాలనీ కోరారు. ఒడిశా, పశ్చిమ్‌ బంగా తదితర రాష్ట్రాల్లోనూ రక్తం కొరత ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

రక్త దానం... ప్రాణ దానం!

ఎప్పుడూ సమస్యే

నిజానికి మనదేశంలో రక్తం కొరత సమస్య ఇప్పటిది కాదు, ఎప్పుడూ ఉన్నదేనట. ఆ మధ్య లాన్సెట్‌ పత్రిక ఒక అధ్యయనాన్ని ప్రచురించింది. దాని ప్రకారం ప్రపంచంలో అన్ని దేశాల కన్నా మన దేశంలోనే రక్తం కొరత ఎక్కువగా ఉంది. ఏకంగా నాలుగు కోట్ల పది లక్షల యూనిట్ల కొరత ఉందనీ మరో పక్క డిమాండు దీనికన్నా 400 శాతం ఎక్కువనీ ఆ నివేదిక చెబుతోంది. మొత్తంగా ప్రపంచ దేశాలన్నిట్లో కలిపి పది కోట్ల యూనిట్ల కొరత ఉంటే అందులో నాలుగు కోట్లు ఒక్క మన దేశంలోనే ఉందన్నమాట. రక్తదానం చేసే సామర్థ్యం ఉన్న ప్రతి వెయ్యి మందిలోనూ 85 మంది రక్తదానం చేస్తే రక్తం కొరత ఉండదు. అయితే ఇక్కడ 31 మంది మాత్రమే చేస్తున్నారట. దీని ప్రభావం వల్ల సమయానికి రక్తం అందక ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు తగినంత ఆరోగ్యవంతమైన రక్తం ఒంట్లో లేక నిస్సత్తువగా రోజులు గడుపుతున్నారు. దాని ఫలితం వ్యక్తిగత, కుటుంబ జీవితాలమీదే కాదు దేశ ఆర్థిక వ్యవస్థ మీద కూడా పడుతోంది.

రక్తదానం ప్రాణదానమే!

మనిషి... సాటి మనిషికి ఇచ్చే వెలకట్టలేని బహుమతి- రక్తం. దానివల్ల ప్రాణాలనే నిలబెట్టవచ్చు. ఒక్కరి ప్రాణమే కాదు, దాన్ని ఎర్రరక్తకణాలు, ప్లాస్మా తదితర భాగాలుగా విడగొట్టడం ద్వారా ఒక యూనిట్‌ రక్తంతో ముగ్గురి ప్రాణాలు కాపాడవచ్చు. పుట్టుకతో వచ్చే కొన్నిరకాల సమస్యల వల్ల కొందరికి రక్తం సరిగా తయారు కాదు. హిమోగ్లోబిన్‌ సరిగా ఉండని తలసేమియా బాధి తులకీ, రక్తం గడ్డకట్టని హీమోఫీలియా బాధితులకీ నిరంతరం ఇతరుల నుంచి తీసుకున్న తాజా రక్తాన్ని ఎక్కించాల్సి ఉంటుంది. కొన్ని రకాల క్యాన్సర్‌ చికిత్సలు జరిగేటప్పుడు రోగికి సగటున వంద యూనిట్ల వరకూ రక్తం అవసరమవుతుంటుంది. ఇవి కాకుండా ఇంకా శస్త్రచికిత్సలప్పుడూ, కాన్పుల సమయంలోనూ, ప్రమాదాల్లో గాయపడినప్పుడు తీవ్ర రక్తస్రావమైతే... అత్యవసరంగా రక్తం ఎక్కించాల్సి వస్తుంది. మన దేశంలో ఏటా కొన్ని కోట్ల పెద్ద ఆపరేషన్లూ, లక్షలాది క్యాన్సర్‌ చికిత్సలూ జరుగుతున్నాయి. ఇక రోడ్డు ప్రమాదాలైతే ఏకంగా రోజుకు కొన్ని వందలు. పైన చెప్పిన రక్తం కొరత లెక్కల్ని బట్టి చూస్తే ఇలాంటి అవసరాల్లో ఉన్నవారు ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారనే అర్థం.

రక్త దానం... ప్రాణ దానం!

దాతలు కావాలి!

రక్తాన్ని ప్రయోగశాలలో తయారుచేయలేం కాబట్టి రక్తం కావాలంటే దాతలు ముందుకు రావాల్సిందే. కానీ సాధారణ ప్రజానీకంలో చాలామందికి రక్తదానం పట్ల ఎన్నో అపోహలు. తమ ఆరోగ్యానికి ఎక్కడ ముప్పొస్తుందోనని భయపడి దూరంగా ఉండేవారే ఎక్కువ. అవగాహనతో ముందుకొచ్చినవారే మళ్లీ మళ్లీ రక్తదానం చేస్తుంటారు. అనారోగ్యం వల్ల కుటుంబంలో ఎవరికైనా రక్తం ఎక్కించాల్సిన అవసరం వచ్చినప్పుడే చాలామందికి రక్తదానం విలువ తెలుస్తోంది. అయినా ఆ అవసరం గడిచాక దాని గురించి మర్చిపోయేవారే ఎక్కువ. చాలా తక్కువ మంది మాత్రమే గుర్తుంచుకుని ఆ దిశగా తమ వంతు కృషిచేస్తున్నారు.

తండ్రిని చూసి...: హైదరాబాద్‌లోని కొన్ని ప్రధాన ఆస్పత్రుల్లో అత్యవసరంగా రక్తం కావాలంటే గబుక్కున గుర్తొచ్చే పేరు బంటీ. చార్మినార్‌ ప్రాంతంలో ఉండే ఈ యువకుడు మూత్రపిండాలు పాడైపోయిన తండ్రికోసం తన రక్తం ఇచ్చేవాడు. ఆస్పత్రుల్లో రక్తం అవసరమూ బాధితులు పడే అవస్థా కొన్ని సంవత్సరాల పాటు ప్రత్యక్షంగా చూసినవాడు కావడంతో తండ్రి మరణించినా రక్తదానం చేసే తన అలవాటును అలాగే కొనసాగించాడు. తానూ తన కుటుంబమే కాక కొన్ని వేలమంది సభ్యులతో రక్తదాతల సైన్యాన్నే తయారుచేశాడు. ‘బీయింగ్‌ హ్యూమన్‌ ఏక్‌ ఉమీద్‌’ పేరుతో ఫేస్‌బుక్‌ పేజీ పెట్టి పదిహేను వేల మందిని ఒక వేదిక మీదికి చేర్చాడు.

ఎక్కడ ఎప్పుడు ఎవరికి రక్తం కావాలన్నా మేమున్నామంటూ ఈ బృంద సభ్యులు వాలిపోతారు. ఇలాంటి వారి చొరవ వల్లే 2800 మంది సభ్యులున్న హైదరాబాదులోని తలసేమియా సొసైటీ రక్తం కొరత రాకుండా చూసుకోగలుగుతోంది.

ఆ బాధ చూడలేక...: ఓ పదేళ్ల చిన్నారికి రక్తం అవసరమంటూ నీది అదే గ్రూపు కదా ఇవ్వకూడదూ అని ఓ స్నేహితుడు ఉజ్వల్‌కి ఫోన్‌ చేశాడు. ఇంజెక్షన్‌ అంటేనే భయపడే ఉజ్వల్‌ తప్పించుకుందామని చూశాడు కానీ స్నేహితుడు వదల్లేదు. ఆస్పత్రికి వెళ్లాక కూడా తన వల్ల కాదని వెనక్కి తిరిగిన ఉజ్వల్‌ కాళ్లమీద పడి తన బిడ్డ ప్రాణాలను కాపాడమంటూ ప్రాధేయపడ్డాడట ఆ చిన్నారి తండ్రి. దాంతో తప్పనిసరై మొదటిసారి రక్తదానం చేసిన ఉజ్వల్‌ ఆ పిల్లవాడు కోలుకుని తిరగడం చూశాక రక్తదానం ఎంత గొప్పదో అర్థమైందంటాడు. అని ఊరుకోలేదు... ఆ విషయాన్ని తన స్నేహితులందరికీ చెప్పాడు. అలా ఏడాది తిరిగేసరికల్లా ‘రక్త అర్చన’ పేరుతో ఇండోర్‌లో పది వేలమంది రక్తదాతల సైన్యాన్ని తయారుచేశాడు.

రికార్డు స్ఫూర్తి:బెంగళూరుకు చెందిన లతకి అరవై ఐదేళ్లు నిండాయి కాబట్టి తాను రక్తదానం చేయలేదు, అలాగని ఊరుకోలేదామె. వేల మందితో చేయించింది. రోటరీ క్లబ్‌ సాయంతో ఒకేరోజు 13 చోట్ల రక్తదాన శిబిరాలు పెట్టి మూడు వేల లీటర్ల రక్తం సేకరించి గిన్నిస్‌ రికార్డు నెలకొల్పింది. రికార్డు అంటే త్వరగా వస్తారని మాత్రమే అలా అన్నాను కానీ నాకు పేరు ముఖ్యం కాదు, ఆ రక్తం ఎన్నో వేల ప్రాణాలను నిలబెట్టి ఉంటుంది కదా... అదీ కావాలి. ఒకసారి రక్తదానం చేయడం అలవాటైతే మళ్లీ మళ్లీ చేస్తారు. అందుకే ఆ ప్రయత్నం చేశాను- అంటుందామె.

వెతికితే ఇలాంటి స్ఫూర్తిప్రదాతలు ప్రతి ఊళ్లోనూ ఉంటారు. కావాల్సిందల్లా ఆ స్ఫూర్తిని అందిపుచ్చుకుని మరి కొందరు రక్తదాతలు కావటమే!

రక్త దానం... ప్రాణ దానం!

మీరూ కావచ్చు!

రక్తదానానికి ప్రత్యేక అర్హతలేమీ అక్కర్లేదు. ఎలాంటి అనారోగ్యాలూ లేకుండా కనీస బరువు 45 కిలోలు ఉన్నవారు ఎవరైనా రక్తం ఇవ్వచ్చు. అక్కడి సిబ్బంది ముందుగా ఆరోగ్యం, జీవనశైలి, అలవాట్లు లాంటి వాటి గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఏవీ దాయకుండా చెప్పాలి. మొదటిసారి కొన్ని సాధారణ పరీక్షలు చేస్తారు. చేతి వేలి నుంచి ఒక్క చుక్క రక్తం తీసి రక్తంలో ఐరన్‌ స్థాయులు చాలినంత ఉన్నదీ లేనిదీ పరీక్షిస్తారు. ఉంటేనే రక్తదానాన్ని స్వీకరిస్తారు. ఈ మొత్తం విధానంలో వాడే పరికరాలన్నీ కూడా స్టెరైల్‌ చేసినవీ లేదా ఒకసారి వాడి పారేసేవీ మాత్రమే అయి వుంటాయి కాబట్టి ఏవిధమైన అనుమానాలూ అక్కర్లేదు. ఆ పరీక్ష అయిపోయాక, డోనార్‌ బెడ్‌ మీద పడుకోబెట్టి రక్తాన్ని సేకరిస్తారు. సాధారణంగా ఒకరి నుంచి ఒక యూనిట్‌ రక్తాన్ని మాత్రమే తీసుకుంటారు. రక్తం తీసుకున్నాక వెంటనే నీరసం రాకుండా పండ్లరసమో బిస్కట్లో ఇస్తారు. ఆ చేత్తో ఓ ఐదారు గంటలపాటు బరువులెత్తకూడదు. ఆ తర్వాత రెండు రోజులపాటు ద్రవ పదార్థాలు ఎక్కువగానూ సమతులాహారమూ తీసుకోవాలి. పొగతాగడం, మద్యం తీసుకోవడం చేయకూడదు. అరుదుగా కొందరికి కళ్లు తిరిగినట్లు అవుతుంది. అలాంటప్పుడు కాసేపు పడుకుంటే చాలు, కోలుకుంటారు.

దేశ జనాభాలో రెండు శాతం రక్తదానం చేసినా సరిపోతుందంటారు నిపుణులు. అలా చేస్తే మన దేశంలో ఉన్న నూట ముప్పై కోట్ల జనాభా నుంచి 2.60 కోట్ల యూనిట్ల రక్తం సేకరించవచ్చు. కానీ ఇప్పుడు సేకరిస్తున్నది 1.4 కోట్ల యూనిట్లు మాత్రమే. అందుకే సరిపోవటం లేదు. ఒకసారి సేకరించిన రక్తాన్ని 35 నుంచి 42 రోజుల వరకే నిల్వ చేయగలం. ఆ తర్వాత పనికి రాదు కాబట్టి ఎప్పటికప్పుడు ఆ నిల్వలను భర్తీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి రక్తదానం అనేది ఒక్కరోజుతోనో ఒక్క నెలతోనో అయిపోయేది కాదు. ఎప్పటికప్పుడు చేస్తూనే ఉండాలి. అవసరానికి తగినట్లుగా రక్తదాతల సంఖ్య పెరుగుతూనే ఉండాలి.

  • సంపన్నులం కానక్కరలేదు...
  • చదువూ హోదాలతో పనిలేదు...
  • మనుషులమైతే చాలు... మరో మనిషి ప్రాణం నిలపగలం!
  • ఆ శక్తి మన రక్తానికి ఉంది. అందుకే రక్తదానం చేద్దాం!

ఇచ్చినవారికీ లాభమే!

రక్తదానం చేయటం వల్ల దాతలకూ లాభమేనట. ఎలాగంటే...

  • రక్తదానం చేసేవారిలో గుండెపోటు వచ్చే అవకాశాలు 88 శాతం తగ్గుతాయి. ఏ రకమైన గుండెజబ్బులైనా వచ్చే అవకాశాలు 33 శాతం తగ్గుతాయి... రక్తదానం చేసినప్పుడు శరీరం నుంచి 225 నుంచి 250 మిల్లిగ్రాముల ఇనుము పోతుంది. దాంతో గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.
  • రక్తదానం చేసినప్పుడు ఆ బ్లడ్‌ బ్యాంకు దాతల రక్తాన్ని పలు కోణాల్లో పరీక్షిస్తుంది. కాబట్టి ఎవరికైనా ఏమైనా సమస్యలున్నా వెంటనే తెలిసిపోతుంది.
  • ఒకసారి రక్తదానం చేశాక 48 గంటల్లోనే శరీరం దాన్ని భర్తీ చేసుకుంటుంది. కాబట్టి మూడు నెలలకు ఓసారి రక్తదానం చేయొచ్చు.

ఈ-రక్తకోశ్‌

నాలుగేళ్ల క్రితం కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆన్‌లైన్లో ‘ఈ-రక్తకోశ్‌’ పేరుతో ఓ డేటాబేస్‌ని ప్రారంభించింది. రక్తం అవసరమైనవారూ, రక్తం ఇవ్వాలనుకునేవారూ... అందరికీ అవసరమైన సమాచారం ఇందులో ఉంటుంది. రాష్ట్రాలన్నీ ఎప్పటికప్పుడు వివరాలను అప్‌డేట్‌ చేస్తాయి. దీని వల్ల బ్లడ్‌బ్యాంకుల కోసం వెతుక్కునే టైమ్‌ వృథా కాదు. అరుదుగా లభించే బ్లడ్‌ గ్రూపుల రక్త దాతల జాబితాతో సహా పలు వివరాలు ఇందులో ఉన్నాయి. రక్తదానం చేయాలనుకునేవారు తమ పేరును ఇందులో నమోదు చేసుకోవచ్చు. మీరున్న రాష్ట్రం, నగరంలో మీకు దగ్గరగా ఉన్న బ్లడ్‌ బ్యాంక్‌ ఏదో తెలుసుకుని నేరుగా వెళ్లి రక్తదానం చేయొచ్చు. తలసేమియా బాధితులు తమ అవసరాలనూ, చిరునామానూ ఈ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకుంటే దగ్గర్లో ఉన్న బ్లడ్‌ బ్యాంకు వివరాలు తెలియ జేస్తారు. రక్తదాన శిబిరాలు ఎప్పుడు, ఎక్కడెక్కడ నిర్వహించేదీ తెలుస్తుంది. ఏ రాష్ట్రం, ఏ నగరానికి చెందిన వారైనా సరే తమ దగ్గర్లో ఉన్న బ్లడ్‌ బ్యాంకుల గురించి తెలుసుకోవచ్చు.

రక్త దానం... ప్రాణ దానం!

ఎవరైనా... ఎప్పుడైనా...

లాక్‌డౌన్‌ వేళ ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలని బ్లడ్‌బ్యాంకుల సేవలను కేంద్రీకరించి స్టాండ్‌ఎలోన్‌ బ్లడ్‌బ్యాంక్‌గా హైదరాబాద్‌లోని ఐపీఎం(ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌)కి గుర్తింపు ఇచ్చింది ప్రభుత్వం. దాంతో ఎవరైనా, ఎప్పుడైనా వచ్చి ఇక్కడ రక్తదానం చేయవచ్చు. కరోనా నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని మరీ ఈ సంస్థ సిబ్బంది రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ దగ్గర రక్తసేకరణకు ఉపయోగపడే వాహనాలు రెండు ఉన్నాయి. వాటిల్లో ఓ వైద్యాధికారి, ల్యాబ్‌ టెక్నీషియన్‌తో పాటు ఒక కౌన్సెలర్‌ కూడా ఉంటారు. వీళ్లు జిల్లాల్లో తిరుగుతూ రక్తదానం గురించి ప్రచారం చేస్తూ దాతల నుంచి రక్తం సేకరించి బ్లడ్‌బ్యాంకుకు పంపుతారు.

ఒక్కో వ్యాను రోజుకు 30 నుంచి 40 యూనిట్ల వరకూ రక్తం సేకరించగలుగుతుంది. ఈ వాహనాల ద్వారానూ, నేరుగా సంస్థకు వచ్చి ఇచ్చిన వారి దగ్గర్నుంచీ సేకరించిన రక్తాన్ని ప్రాసెస్‌ చేసి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల నుంచీ వచ్చిన డిమాండును బట్టి ఎవరికి అవసరమైంది వారికి సరఫరా చేస్తోంది ఐపీఎం. రక్తదానం చేయాలనుకునేవారు 040 29569047 నంబరుకి ఫోన్‌ చేస్తే అపాయింట్‌మెంట్‌ ఇస్తారు. దానికి అవసరమైన పాస్‌ కూడా వాట్సాప్‌లో పంపుతారు. లాక్‌డౌన్‌ వేళ అయినా అది చూపించి పోలీసుల అనుమతి తీసుకుని వెళ్లవచ్చు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉన్నా రక్తదానం చేసేవారిని తమ వాహనంలో తీసుకెళ్లి మళ్లీ ఇంటి దగ్గర దింపే ఏర్పాటు కూడా తెలంగాణ పోలీసులు చేస్తున్నారు.

రక్త దానం... ప్రాణ దానం!

ఇదీ చూడండి:'కరోనా వ్యాప్తి నియంత్రణలో భారత్‌ భేష్‌'

ABOUT THE AUTHOR

...view details