బ్లాక్ ఫంగస్ (Black fungus) చికిత్స కోసం ఉపయోగించే ఇంజక్షన్లు కేంద్రం నుంచి సరిపడా అందకనే ఇబ్బందులు ఎదురవుతున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆరోపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్నవారిలో వేలాదిమంది బ్లాక్ ఫంగస్(Black Fungus) బారినపడ్డారు. హైదరాబాద్‌లోని గాంధీ, ఈఎన్‌టీ, సరోజినీదేవి కంటి ఆసుపత్రుల్లో 500 మంది వరకు చికిత్స పొందుతున్నారు. ప్రైవేటు వైద్యశాలల్లో మరికొంతమంది చేరారు. ఈ వ్యాధి చికిత్సలో ప్రధానంగా లైపొసోమల్ ఆంఫొటెరిసిన్-బి(Amphotericin-b) ఇంజక్షన్లు వాడుతున్నారు.
ప్రస్తుతం బ్లాక్ ఫంగస్ (Black fungus) బాధితులకు శరీర బరువును అనుసరించి రోజూ 3-5 మిల్లీ గ్రాముల సూది మందును మూడు నెలలపాటు రోజూ ఇవ్వాలని సరోజినీదేవి ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఒక వయల్‌లో 50 మిల్లీ గ్రాములు ఉంటుంది. ప్రతి బాధితునికి సగటున రోజుకు 3 మి.గ్రా. ఇచ్చినా 90 రోజులకు 270 ఇంజక్షన్లు అవసరమవుతాయి. కేంద్ర ప్రభుత్వమే వాటిని ఉత్పత్తి సంస్థల నుంచి సేకరించి రాష్ట్రాలకు పంపిణీ చేస్తోంది. అవసరం మేరకు సరఫరా కాకపోవడంతో గాంధీ, ఈఎన్‌టీ, సరోజినీదేవి కంటి ఆసుపత్రుల్లో ఉన్న రోగులందరికీ పూర్తి కోర్సుకు సరిపడా ఇంజక్షన్లు ఇవ్వలేకపోతున్నారు. కొందరికి 3 రోజులు, మరికొందరికి 5 రోజులు, ఇంకొందరికి వారంపాటు ఇచ్చి ఇళ్లకు పంపేస్తున్నారు. ప్రత్యామ్నాయంగా పొసకొనజోల్ గోలీలు (100 మి.గ్రా.) మూడు వారాలకు సరిపడా ఇచ్చి పంపుతున్నారు.