తెలంగాణ

telangana

ETV Bharat / state

black fungus: జోరుగా బ్లాక్ ఫంగస్ ఔషధాల అక్రమ విక్రయాలు - black fungus medicines selling at high prices

బ్లాక్ ఫంగస్ ఔషధాల అక్రమ విక్రయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రాణాధార ఔషధాలను నల్లబజారులో విక్రయించకుండా పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఆ దందా మాత్రం ఆగడం లేదు. పోలీసులు నిఘా పెట్టి అరెస్టులు చేస్తున్నా.. ఔషధ ముఠాలు అధిక ధరకు విక్రయాలు చేస్తూనే ఉన్నాయి. కొన్ని ఘటనల్లో ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులు, వైద్య సిబ్బంది, మెడికల్ షాపుల నిర్వాహకుల హస్తం బయటపడుతోంది.

black fungus medicines in black market
బ్లాక్ ఫంగస్ ఔషధాల అక్రమ విక్రయాలు

By

Published : Jun 12, 2021, 10:11 AM IST

జోరుగా బ్లాక్ ఫంగస్ ఔషధాల అక్రమ విక్రయాలు

కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నా బ్లాక్ ఫంగస్ బాధితులు మాత్రం పెరుగుతూనే ఉన్నారు. దీంతో బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం ఉపయోగిస్తున్న ఆంపోటెరిసిన్ ఇంజక్షన్ల ధరలకు రెక్కలొచ్చాయి. ఈ ఇంజక్షన్ కంపెనీని బట్టి రూ. 400 నుంచి రూ. 7వేల వరకు ఉంటుంది. కానీ అక్రమంగా మాత్రం 35 వేల నుంచి 50వేల రూపాయల వరకు విక్రయిస్తున్నారు. రోగులు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడాలంటే... ఈ ఇంజక్షన్లను తీసుకోవాల్సి ఉంటుంది. సరిపడా ఇంజక్షన్లు అందుబాటులో లేకపోవడంతో అధిక ధర చెల్లించి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వాస్తవానికి ఈ ఇంజక్షన్లను ఆస్పత్రులు, గుర్తింపు పొందిన డీలర్లు మాత్రమే నిర్ధరించిన ధరకు అమ్మాల్సి ఉంటుంది. కానీ ఎవరు పడితే వాళ్లు అక్రమంగా విక్రయిస్తున్నారు. వైద్యులు, సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్లు, మెడికల్ షాప్ నిర్వాహకులు, మెడికల్ రిప్రజెంటేటివ్‌లు బృందాలుగా ఏర్పడి అక్రమాలకు పాల్పడుతున్నారు. రోగికి ఇంజక్షన్లు ఇవ్వకుండానే... ఇచ్చినట్లు చూపించి, వాటిని వైద్యులు కాజేస్తున్నారు. తర్వాత వాటిని బయట అమ్మేస్తున్నారు. ఔషధాల బ్లాక్ మార్కెట్ సంఘటనల్లో పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా 160 కేసులు నమోదు చేశారు. అత్యధికంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోనే ఉన్నాయి.

దాచుకొని.. అమ్ముకొని..

గాంధీ ఆస్పత్రిలో పొరుగుసేవల కింద పనిచేసే రేఖ... రోగులకు ఇవ్వాల్సిన ఆంపోటెరిసిన్ ఇంజక్షన్లలో నాలుగింటిని దాచుకుంది. వాటిని తనకు తెలిసిన వాళ్ల సాయంతో విక్రయించేందుకు ప్రయత్నించింది. సుచిత్ర కూడలిలో ఉన్న ఓ కార్పోరేట్ ఆస్పత్రిలో విక్రయించేందుకు ప్రయత్నించగా... పక్కా సమాచారంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. యూసుఫ్ గూడలో మెడికల్ షాపు నిర్వహించే ముకుందరావు.. 30 బ్లాక్‌ఫంగస్ ఇంజక్షన్లను విక్రయించగా.. అతడితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారం క్రితం ఈఎస్​ఐ ఆస్పత్రిలో పనిచేసే వైద్యుడు ఓబుల్ రెడ్డి ఆస్పత్రి నుంచి ఇంజక్షన్లను పక్కదారి పట్టించి బయట విక్రయించాడు. ఎస్ఓటీ పోలీసులు సమాచారం అందుకొని ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈఎస్ఐ ఆస్పత్రి వైద్యుడు ఓబుల్ రెడ్డి మాత్రం తప్పించుకున్నాడు. మలక్‌పేటలోని ఓ కార్పోరేట్ ఆస్పత్రిలో పనిచేసే వైద్యుడు రాఘవేందర్ గౌడ్, క్లీనిక్ నిర్వహిస్తున్న రమేశ్... బ్లాక్ ఫంగస్ ఇజంక్షన్లను అధిక ధరకు విక్రయిస్తుండగా పోలీసులు ఐదు రోజుల క్రితం అరెస్ట్ చేశారు. ప్రధాన సూత్రధారి అయిన ఓ వైద్యుడు మాత్రం తప్పించుకున్నాడు. మొన్నటి వరకు రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లకు డిమాండ్ ఉండగా వాటిని అధిక ధరలకు అమ్మారు. ఇప్పుడు బ్లాక్‌ఫంగస్‌ చికిత్సకు వాడే ఇంజక్షన్లను అమ్ముతున్నారు.

తరచూ పోలీసు దాడులు జరుగుతున్నా.... రోజూ బ్లాక్ ఫంగస్ ఔషధాల అక్రమ అమ్మకాలకు సంబంధించి 10 కేసుల వరకు నమోదవుతూనే ఉన్నాయి. అధిక ధరకు విక్రయిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఇదీ చదవండి:విధులకు డుమ్మా కొట్టిన టీచర్లు ఎందరు?

ABOUT THE AUTHOR

...view details