వైద్య వృత్తికే కళంకం తెస్తున్నారు కొంతమంది వైద్యులు. వైద్యో నారాయణ హరి అనే దానికి అర్థం లేకుండా చేస్తున్నారు. ఈఎస్ఐ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓబుల్ రెడ్డి అనే వైద్యుడు ఈ కోవలోకే వస్తాడు. ఆస్పత్రిలో ఉన్న బ్లాక్ ఫంగస్ రోగులకు ఇవ్వాల్సిన ప్రాణాంతక ఔషధాలను.. పక్కదారి పట్టించి, నల్లబజారులో అధిక ధరకు విక్రయిస్తున్నాడు. మాదాపూర్ ఎస్ఓటీ పోలీసుల దాడుల్లో ఈ విషయం బయటపడింది.
ఇంజక్షన్ల బ్లాక్ దందా
ఎర్రగడ్డ ఈఎస్ఐ ఆస్పత్రిలో జనరల్ ఫిజీషియన్ వైద్యుడిగా పనిచేస్తున్న ఓబుల్ రెడ్డి... ఆస్పత్రిలో ఎవరికీ తెలియకుండా ఆంపోటెరిసిన్-బి ఇంజక్షన్లను మాయం చేశాడు. వీటిని చింతల్లో మెడికల్ షాపు నిర్వహిస్తున్న వికాస్ రెడ్డికి అధిక ధరకు విక్రయించాడు. వికాస్ రెడ్డి ఒక్కో ఇంజక్షన్‌పై 5వేలు అధికంగా తీసుకొని నాగరాజుకు విక్రయించాడు. నాగరాజు మరో రూ.10వేలు ఎక్కువ ధరకు పేట్ బషీరాబాద్‌లో మెడికల్ షాపు నిర్వహిస్తున్న శ్రీధర్‌కు విక్రయించాడు. శ్రీధర్... ఇంజక్షన్లు అవసరమైన రోగులకు మరో 5వేలు ఎక్కువ తీసుకొని 45 నుంచి 50వేల వరకు విక్రయించాడు. శ్రీధర్ ఒక అడుగు ముందుకు వేసి ఇతర యాంటిబయటిక్ ఇంజక్షన్లకు ఆంపోటెరిసిన్ స్టిక్కర్లు వేసి... అమాయక రోగులను నమ్మించి విక్రయించడం మొదలు పెట్టాడు. ఆంపోటెరిసిన్ ఇంజక్షన్లను కూకట్ పల్లి ప్రగతినగర్లోని సెలాన్ ల్యాబోరెటరీస్లో ఉత్పత్తి చేస్తున్నారు. ఆ కంపెనీ పేరుమీద జిరాక్స్ సెంటర్లో స్టిక్కర్లు తయారు చేయించి... పలు యాంటీబయటిక్ ఇంజక్షన్లకు ఈ స్టిక్కర్లు వేసి విక్రయించడం మొదలు పెట్టాడు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు వికాస్, నాగరాజు, శ్రీధర్‌లను అరెస్ట్ చేశారు. ఈఎస్ఐ వైద్యుడు ఓబుల్ రెడ్డి పరారీలో ఉన్నాడు. వీరి నుంచి 5 లక్షల విలువ చేసే ఔషధాలతో పాటు కారు స్వాధీనం చేసుకున్నారు.
ఒక్కో ఇంజక్షన్ 20 నుంచి 40వేలు