సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బ్లాక్‌ఫంగస్ రోగుల సంఖ్య ఆదివారానికి 102కు చేరింది. మరోవైపు రోగులకు చికిత్స అందించడంలో వైద్యసిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. సూదిమందులు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ.. యాంటీబయాటిక్ మాత్రలు వేస్తున్నారని వాపోతున్నారు. వైద్య పరీక్షల్లోనూ నిర్లక్ష్యం వహిస్తున్నారని చెబుతున్నారు.
‘మూడు రోజుల క్రితం ఆసుపత్రిలో చేర్చగా.. ఇప్పటివరకు కేవలం మందుబిళ్లలు మాత్రమే వేస్తున్నార’ని ఓ మహిళ బంధువు వాపోయారు. సీటీస్కాన్ తలకు తీయాల్సి ఉండగా వేరేచోట తీశారని, ప్రశ్నించగా.. జరిగిన పొరపాటుపై వైద్యసిబ్బంది వారిలోవారే వాదులాడుకున్నట్లు తెలిపారు. ఉదయం, సాయంత్రం వేళల్లో వైద్యులు రౌండ్స్‌కి రావడం లేదని, నర్సులే చూస్తున్నారని.. వైద్యుల పర్యవేక్షణలేక రోగులకు ఏదైనా అయితే ఎవరు బాధ్యులని ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఆసుపత్రి వర్గాలను వివరణ కోరగా.. అత్యవసర రోగుల చికిత్సకు ప్రాధాన్యం ఉంటుందని, మిగతా రోగులనూ పర్యవేక్షిస్తూ అవసరమైన వైద్యం అందిస్తున్నట్లు వివరించారు.