గతంతో పోల్చితే వైట్ ఫంగస్ కేసుల సంఖ్య నామమాత్రమేననీ, బ్లాక్ ఫంగస్ కేసులు మాత్రం ఊహించని విధంగా నమోదవుతున్నాయని ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విద్యాలయంలో సీనియర్ వైద్యనిపుణులు డాక్టర్ తర్జనీ వివేక్ దవే అన్నారు. కొవిడ్ చికిత్సలో భాగంగా మితిమీరి స్టిరాయిడ్‌లను వినియోగించిన ఫలితంగా ఈ దుస్థితి ఎదురవుతోందని ఆమె అభిప్రాయపడ్డారు. తొలి దశలోనే మ్యూకర్ మైకోసిస్‌కు చికిత్స అందించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని భరోసా ఇచ్చారు. ముఖ్యంగా షుగర్ వ్యాధిని అదుపులో పెట్టుకోవడం ద్వారా బ్లాక్ ఫంగస్‌ను కూడా నియంత్రించవచ్చని సూచించారు. ‘ఆర్బిటో ఫేసియల్ ఫ్రాక్చర్స్’ చికిత్సలో, ‘మైగ్రేటెడ్ ఆర్బిటల్ ఇన్‌ప్లాంట్స్’ అమరికలో డాక్టర్ దవే నిష్ణాతురాలు. 60కి పైగా వైద్య వైజ్ఞానిక వ్యాసాలను ఆమె సమీక్షించారు. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వేదికలపై నేత్ర వైద్యంపై అనేక ప్రసంగాలు చేశారు. రాష్ట్రంలో మ్యూకర్ మైకోసిస్ కేసులు క్రమేణా పెరుగుతున్న నేపథ్యంలో డాక్టర్ తర్జనీ దవేతో ప్రత్యేక ముఖాముఖి.
అకస్మాత్తుగా బ్లాక్ ఫంగస్ తీవ్ర రూపం దాల్చడానికి కారణాలేమిటి?
సాధారణంగానే కరోనా వైరస్ సోకిన వారిలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీనికి తోడుగా చక్కెర వ్యాధి ఏ మాత్రం నియంత్రణలో లేకపోవడం, కొవిడ్ సమయంలో స్టిరాయిడ్స్ ఎక్కువగా వాడటం వల్ల బాధితుల్లో రోగనిరోధక శక్తి గణనీయంగా పడిపోతుంది. ఫలితంగా మ్యూకర్ మైకోసిస్ సులభంగా దాడిచేస్తుంది. కొవిడ్‌కు ముందు కూడా బ్లాక్ ఫంగస్ కేసులున్నా.. అప్పుడవి నామమాత్రమే. కానీ ఇప్పుడు తీవ్ర రూపం దాల్చింది. అయితే ఆందోళనకు గురికావల్సిన అవసరం లేదు. కొవిడ్ సమయంలోనూ, కోలుకున్న తర్వాత కూడా రక్తంలో చక్కెర స్థాయులను అదుపులో ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు ఫిజీషియన్‌ను సంప్రదిస్తూ అవసరమైన చికిత్స పొందాలి.
ఎటువంటి కేసులు ఎక్కువగా వస్తున్నాయి
బ్లాక్ ఫంగస్‌తో వచ్చిన రోగులను పరీక్షించినప్పుడు వారి రక్తంలో షుగర్ స్థాయులు గణనీయంగా పెరిగి ఉంటున్నాయి. పైగా వీరు కొవిడ్ చికిత్సలో భాగంగా స్టిరాయిడ్ ఔషధాలను విపరీతంగా వాడి ఉన్నారు. దీంతో బాగా ముదిరిన తర్వాత వచ్చిన కేసులు ఎక్కువగా ఉంటున్నాయి.