BJYM Activists Protest at Pragati Bhavan: పోలీస్ ఉద్యోగాల ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నిబంధనలను వ్యతిరేకిస్తూ... బీజేవైఎం ఆందోళనకు దిగింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ఆ సంఘం నేతలు... హైదరాబాద్ ప్రగతిభవన్ ముట్టడికి యత్నించారు. ఆందోళన నేపథ్యంలో ముందుగానే అప్రమత్తమైన పోలీసులు... ముట్డడి కోసం వస్తున్న వారిని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ప్రగతి భవన్ వద్దకు ఒక్కసారిగా బీజేవైఎం నేతలు దూసుకురావటంతో... పోలీసులకు, ఆందోళనకారులకు తోపులాట జరిగింది.
ఉద్రిక్తంగా మారిన బీజేవైఎం కార్యకర్తల ప్రగతిభవన్ ముట్టడి దీంతో రహదారిపైనే బీజేవైఎం శ్రేణులు బైఠాయించటంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు... ప్రత్యేక వాహనాల్లో స్టేషన్‌కు తరలించారు. ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం దేశంలో ఎక్కడా లేని నిబంధనలు రాష్ట్రంలో తీసుకువచ్చారని ఆరోపించారు. కొత్త నిబంధనలతో వేలాది మంది పోలీస్ అభ్యర్థులకు నష్టం జరుగుతుందని... పరుగు పందెంలో ఉత్తీర్ణులైన వారందరినీ మెయిన్స్ పరీక్షలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల పట్ల తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
పాతపద్దతిలోనే దేహాదారుఢ్య పరీక్షలు నిర్వహించాలని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ తుగ్లక్ నిర్ణయాలతో లక్షలాది మంది నిరుద్యోగులు నష్టపోతున్నారని మండిపడ్డారు. తక్షణమే లాంగ్ జంప్ ను 4నుంచి 3.8మీటర్లకు కుదించాలన్నారు. గత రిక్రూట్మెంట్లో పరుగుపందెం 800 మీటర్లు ఉండగా దానిని 1600 మీటర్లకు పెంచారు. లాంగ్‌జంప్ 3.8 మీటర్లు ఉంటే 4 మీటర్లు, షాట్‌పుట్ 5.6 మీటర్లు ఉండగా దానిని 6 మీటర్లు పెంచడంతో చాలా మంది అభ్యర్థులు నష్టపోయారని తెలిపారు. అలాగే గతంలో 5 ఈవెంట్లు ఉండగా దానిలో ఏవైనా 3 అర్హత సాధిస్తే వారిని సివిల్, ఫైర్ ఉద్యోగాలకు అనుమతి ఇచ్చేవారని.. ఈసారి అలా కాకుండా అన్ని క్వాలిఫై అయితేనే తుది రాత పరీక్షకు అనుమతించడంతో పోలీస్ ఉద్యోగ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నామని కొందరు విద్యార్థులు వాపోయారు. తక్షణమే ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
నిబంధనలు వెంటనే సవరించాలి:బీజేవైఎం కార్యకర్తలు, పోలీసు పరీక్ష అభ్యర్థులను పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. అరెస్టు చేసిన యువ మోర్చా కార్యకర్తలు, పోలీసు పరీక్ష అభ్యర్థులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎంను కలవడానికి వెళ్లిన బీజేవైఎం, పోలీసు అభ్యర్థులపై పోలీసులు విచక్షణరహితంగా ప్రవర్తించారని ఆయన విడుదల చేసిన ప్రకటనలో మండిపడ్డారు. వీరిపై విచక్షణ రహితంగా వ్యవహారించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. వెంటనే పోలీసు పరీక్షలోని నిబంధనలను సవరించి అన్యాయానికి గురైన అభ్యర్థులకు న్యాయం చేయాలన్నారు.
ఇవీ చదవండి: