తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణపై భాజపా దృష్టి.. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో పోరుకు వ్యూహం - BJp in mla graduate elections

రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. జీహెచ్‌ఎంసీ, వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికలతో పాటు రెండు పట్టభద్రుల స్థానాలకు ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. అన్ని ఎన్నికల్లోనూ విజయమే లక్ష్యంగా అన్ని పార్టీలు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నాయి. జీహెచ్‌ఎంసీ, పట్టభద్రులు, వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికలను భాజపా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటుంది. బూత్‌ స్థాయి నుంచే పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ.. పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది. 2023 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేస్తోన్న కమలనాథులు ఈ ఎన్నికలను సెమీ ఫైనల్‌గా భావిస్తున్నారు. రెండు పట్టభద్రుల స్థానాల ఎన్నికల ప్రచారానికి పార్టీ జాతీయ నాయకత్వంతో పాటు కేంద్రమంత్రులు రానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

BJP's plan of action to contest in GHMC and mlc elections
తెలంగాణపై భాజపా దృష్టి.

By

Published : Oct 24, 2020, 1:15 PM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో భాజపా

నూతన సంవత్సరంలో జరగబోయే జీహెచ్‌ఎంసీ, పట్టభద్రుల ఎన్నికలపై అన్ని పార్టీలు దృష్టి కేంద్రీకరించాయి. విజయమే పరమావధిగా క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా.. దక్షిణాదిన తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించింది. తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా జాతీయ నాయకత్వం దిశానిర్దేశం చేస్తోంది. పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ కంటే ఒక్క స్థానాన్ని అధికంగా గెలుపొంది.. రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయం భాజపానేననే సంకేతాన్ని ఇచ్చారు. త్వరలో జరగనున్న ఎన్నికలను రాష్ట్ర నాయకత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. 2023కు ముందు జరిగే జీహెచ్‌ఎంసీ ఎన్నికలను సెమీ ఫైనల్‌గా భావిస్తోంది.

80 స్థానాల్లో గెలుపుపై ధీమా

భాజపాకు జీహెచ్‌ఎంసీలో కేవలం నాలుగు స్థానాలు మాత్రమే ఉన్నాయి. ఇటీవల ఇతర పార్టీల నుంచి చేరగా ఇప్పుడు ఆ సంఖ్య 7కు చేరింది. రాష్ట్ర కమల దళపతిగా బండి సంజయ్‌ బాధ్యతలు చేపట్టాక జీహెచ్‌ఎంసీ పరిధిలో వ్యక్తిగతంగా సర్వే చేయించారు. తెరాస పట్ల ప్రజల్లో ఉన్న భావన, భాజపాపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను తెలుసుకునేందుకు సర్వే చేయించినట్లు పార్టీ శ్రేణులు తెలిపాయి. 80 స్థానాల్లో గెలుస్తామని కమలదళం ధీమా వ్యక్తం చేస్తోంది. గెలుపే లక్ష్యంగా పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతోంది.

మళ్లీ రాంచందర్​ రావే

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ స్థానం నుంచి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్న రాంచందర్‌రావు మళ్లీ పోటీ చేసేందుకు జాతీయ నాయకత్వం అంగీకరించినట్లు తెలుస్తోంది. రెండు స్థానాలకు ఒకసారే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ రాంచందర్‌ రావు తిరిగి గెలుపొందేందుకు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఒక కో-ఆర్డినేషన్‌ కమిటీని ప్రకటించారు. కో-ఆర్డినేటర్‌గా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల శేఖర్‌రావు, సంయుక్త కో-ఆర్డినేటర్స్‌గా ఎన్వీఎస్ఎస్‌ ప్రభాకర్‌, సుభాష్‌ చందర్జీ, శ్రీవర్థన్‌ రెడ్డిలను నియమించారు.

ప్రచారానికి రానున్న జాతీయ నాయకులు

వరంగల్‌-ఖమ్మం-నల్గొండ స్థానం నుంచి పోటీ చేసేందుకు భాజపా నేతలు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు. వరంగల్‌ జిల్లాకు చెందిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌ రెడ్డి, రావు అమరేందర్‌, ఎడ్ల అశోక్‌ రెడ్డి, చందుపట్ల కీర్తిరెడ్డి టికెట్‌ ఆశిస్తున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్‌ రెడ్డి, నూకల నరసింహారెడ్డిలు పోటీకి ఆసక్తి చూపుతున్నారు. ఈ స్థానం నుంచి వరుసగా నాలుగుసార్లు వరంగల్‌ జిల్లా నేతలకే అవకాశం కల్పించారని ఈ సారి నల్గొండ జిల్లాకు అవకాశం ఇవ్వాలని గట్టిగా పట్టుబడుతున్నారు. పట్టభద్రుల ఎన్నికల ప్రచారానికి జాతీయ నాయకత్వంతో పాటు కేంద్రమంత్రులు ప్రకాశ్‌ జావడేకర్, రవిశంకర్‌ ప్రసాద్, కిషన్ రెడ్డితో పాటు మరికొంత మంది రానున్నట్లు సమాచారం.

ABOUT THE AUTHOR

...view details