MLC Elections 2023 in Telangana: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్, ఎంఐఎంకు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించటంతో బీజేపీ పునరాలోచనలో పడింది. తొలుత ఎన్నికలకు దూరంగా ఉండాలనుకున్న బీజేపీ మారుతున్న సమీకరణాలపై దృష్టి సారించింది. స్థానిక సంస్థ ఎమ్మెల్సీ కోటాలో ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య 118 కాగా ఏ పార్టీ సొంతంగా గెలిచే పరిస్థితి లేదు.
ఎంఐఎం 52, బీజేపీ 25, బీఆర్ఎస్కు 41 ఓట్లుండగా గెలుపు కోసం 60 ఓట్లు రావాల్సి ఉంది. ఈనెల 23న నామినేషన్ల ప్రక్రియ ముగియనుండగా బీజేపీ బరిలో ఉంటే ఓటింగ్ తప్పనిసరి అవుతుంది. హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీర్జా రెహమత్ బేగ్ పేరును మజ్లిస్ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు మీర్జా రెహమత్ పేరును పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు.
2018 ఎన్నికల్లో రాజేంద్రనగర్ నుంచి మజ్లిస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పదవీకాలం ముగుస్తున్న ప్రస్తుత ఎమ్మెల్సీ సయ్యద్ అమీన్ ఉల్హసన్ జాఫ్రీకి అసదుద్దీన్ ధన్యవాదాలు తెలిపారు. జాఫ్రీ అనుభవం, జ్ఞానాన్ని పార్టీ ఉపయోగించుకుంటుందని అసద్ పేర్కొన్నారు.