BJP Vikasit Bharat Sankalp Yatra Starts Today : లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ(BJP) పార్టీ రాష్ట్రంలో వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రను కామారెడ్డి నుంచి ప్రారంభించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏరికోరి ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడంపై ప్రత్యేక కారణం కూడా ఉంది. మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డిని(CM Revanth reddy) ఓడించి డబుల్ జైంట్ కిల్లర్‌గా కాటిపల్లి వెంకట రమణారెడ్డి గుర్తింపు పొందారు. మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఒక మాజీ, ఒక తాజా ముఖ్యమంత్రిని ఢీకొట్టి గెలుపొందడంతో కమలం పార్టీ ఇక్కడి నుంచే యాత్రను షురూ చేయాలని భావిస్తోంది.
లోక్‌సభ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులు ఉండవు : కిషన్‌రెడ్డి
BJP Focus on Parliament Elections in Telangana : దాదాపు 40 రోజుల పాటు ఈ యాత్ర జరగనుండగా, 163 వాహనాలు నిత్యం తిరిగేలా ఏర్పాట్లు చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వాహనాలు తిరగనున్నాయి. ప్రతి రోజు ఈ యాత్ర కొనసాగనుంది. రోజుకు రెండు సెంటర్లలో ఈ కార్యక్రమం కొనసాగేలా చర్యలు తీసుకోనున్నారు. తెలంగాణలో మొత్తం 13 వేల సెంటర్లలో ఈ కార్యక్రమం కొనసాగేలా కేంద్రం ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు కేంద్ర పథకాలకు కొత్త లబ్ధిదారులను ఎన్రోల్ చేసుకోవడం ఈ యాత్ర ఉద్దేశంగా ఉంది.
వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులను భాగస్వాములను చేశారు. ఇదిలా ఉండగా పార్లమెంట్ ప్రవాస్ యోజనలో ఉన్న కేంద్ర మంత్రులు ఈ యాత్రలో 3 రోజులైనా పాల్గొనాలని పార్టీ నేతలకు సైతం ఆదేశించినట్లు తెలుస్తోంది. జన్ జాతీయ గౌరవ్ దివస్‌ను పురస్కరించుకుని గత నెల 15న ఝార్ఖండ్‌లోని రాంచీ నుంచి ప్రధాని మోదీ వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రను ప్రారంభించారు. అయితే తెలంగాణతో పాటు మొత్తం ఐదు రాష్ట్రాలో ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేదు.