Bandi Sanjay Arrest Latest Update: పదో తరగతి ప్రశ్నాపత్రం బయటికి రావటం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి అరెస్టు ఘటనతో రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కరీంనగర్‌లో నిన్న అర్ధరాత్రి వేళ తీవ్ర ఉద్రిక్తత నడుమ.. బండి సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. జ్యోతినగర్‌లోని తన అత్తగారింట్లో ఉన్న బండి సంజయ్ వద్దకు వెళ్లిన పోలీసులు బలవంతంగా తీసుకువచ్చారు.
రాత్రికి రాత్రే యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం ఠాణాకు సంజయ్‌ను తరలించిన పోలీసులు ఉదయం పదిన్నర వరకు అక్కడే ఉంచారు. సంజయ్ అరెస్టు గురించి తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు పెద్దఎత్తున అక్కడికి చేరుకోగా.. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు వారిని ఎక్కడికక్కడే అడ్డుకున్నారు.
అరెస్టు ఎందుకు చేశారనే విషయం తెలుసుకునేందుకు బొమ్మలరామారం స్టేషన్ వద్దకు వచ్చిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పదిన్నర ప్రాంతంలో భారీ కాన్వాయ్ మధ్య సంజయ్‌ను పోలీసులు బొమ్మలరామారం ఠాణా నుంచి బయటకు తీసుకువెళ్లారు. ముందుగా భువనగిరి కోర్టుకు తీసుకెళుతున్నట్లుగా సమాచారం ఇచ్చిన పోలీసులు.. ఆ తర్వాత రూట్ మార్చి హనుమకొండ వైపుగా బండి సంజయ్ వాహనాన్ని తీసుకెళ్లారు. తమ నేతను ఎటువైపు తీసుకెళ్తున్నారంటూ మార్గమధ్యలో బీజేపీ కార్యకర్తలు అడ్డుకునేందుకు యత్నించారు.
Bandi Sanjay Arrest: ఆలేరు సమీపంలోని పెంబర్తి వద్ద బండి సంజయ్‌ను తీసుకెళ్తున్న పోలీస్ వాహనాన్ని బీజేపీ కార్యకర్తలు ఆపే ప్రయత్నం చేశారు. ఎక్కడికి తీసుకువెళ్తున్నారో చెప్పాలంటూ నినాదాలు చేయగా.. పోలీసులు వారిని పక్కకు లాగేశారు. పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సంజయ్‌ను హనుమకొండ వైపుగా తీసుకెళ్లారు. అనంతరం జనగామ జిల్లా పాలకుర్తి ఆస్పత్రిలో సంజయ్‌కు వైద్య పరీక్షలు జరిపించారు. ఆ తర్వాత పాలకుర్తి మీదుగా వర్దన్నపేటకు తీసుకువెళ్లిన పోలీసులు.. అక్కడి నుంచి వరంగల్ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది