తెలంగాణ

telangana

ETV Bharat / state

Bandi sanjay: 'సీఎం కేసీఆర్ అంబేడ్కర్‌ను అవమానించారు'

Bandi sanjay: రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్​ను సీఎం కేసీఆర్​ అవమానించారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని తిరిగి రాయాలనుకుంటున్నారంటే.. కేసీఆర్ ఏం కోరుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ దళిత వ్యతిరేకిగా వ్యవహరిస్తున్నారని.. దళితులపై ఆయనకు ఎంత అక్కసు ఉందో తెలుస్తోందని మండిపడ్డారు.

Bandi sanjay
Bandi sanjay

By

Published : Feb 2, 2022, 4:18 AM IST

Updated : Feb 2, 2022, 6:39 AM IST

రాజ్యాంగాన్ని తిరిగి రాయాలన్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌పై దేశద్రోహం కేసుపెట్టాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. రాజ్యాంగాన్ని మార్చడం కేసీఆర్‌ తరం కాదన్నారు. ‘కేంద్రమంత్రిగా, ముఖ్యమంత్రిగా ఆయన కుంభకోణాల్ని బయటికి తీయబోతున్నాం. త్వరలో అరెస్ట్‌ ఖాయమని తెలిసి ప్రజల్లో సెంటిమెంట్‌ రగిలించేందుకు కేసీఆర్‌ ప్రయత్నం చేస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. ఆదిలాబాద్‌ ఎంపీ బాపురావుతో కలిసి మంగళవారం రాత్రి ఆయన ఆన్‌లైన్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘‘రాజ్యాంగాన్ని మార్చాలంటూ అంబేడ్కర్‌ను కేసీఆర్‌ అవమానించారు. దళితుడైనందుకే రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించారు. దళితుల విషయంలో కుట్రకోణాన్ని ఆయన ఈరోజు ఇలా బహిర్గతం చేశారు. ఇప్పుడైనా దళిత సమాజం స్పందించకుంటే ఆయన ఎంతకైనా తెగిస్తారు.

కేసీఆర్‌ భాష అభ్యంతరకరం

"వివాదాస్పద వ్యాఖ్యలు చేసి దేశమంతా చర్చ జరగాలని కేసీఆర్‌ కోరుకోవడం మూర్ఖత్వం కాదా? ప్రధాని మోదీ, మహిళ అయిన కేంద్ర ఆర్థికమంత్రి విషయంలో ఆయన ప్రయోగించిన భాషను ప్రజలు ఈసడించుకుంటున్నారు. బడ్జెట్‌లో మంచి ఏమీ కనిపించలేదని కేసీఆర్‌ అంటున్నారు. ధాన్యం, గోధుమల కొనుగోలుకే రూ.2లక్షల 37వేల కోట్లను కేటాయించింది. గత ఏడెనిమిది బడ్జెట్‌లపై ఎందుకు మాట్లాడలేదు? మీకు వేల కోట్లు వస్తే మంచి బడ్జెట్‌, లేదంటే కాదా? తెరాస పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ధాన్యం కొననని కేంద్రానికి లేఖ ఇచ్చి రాష్ట్రానికి ద్రోహం చేసింది కేసీఆరే. రారైస్‌ ఎందుకు కొనరో కోతలొచ్చినప్పుడు చెబుతాం."అని సంజయ్​ అన్నారు.

కేటీఆర్‌ సబర్మతి వెళ్లి బాగుంది అనడం నిజం కాదా?

"317జీవో మంచిదైతే పది మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారు? భార్యాభర్తల్ని విడగొట్టిన పాపం కేసీఆర్‌ది. నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలి. వ్యాక్సినేషన్‌కు గ్లోబల్‌ టెండర్లు వేస్తామన్నారు. ఆ డబ్బులు ఏమయ్యాయి? కార్పొరేట్‌ ఆసుపత్రులకు ఎందుకు కొమ్ముకాశారు? ప్రధాని మోదీ భారత్‌ బయోటెక్‌కు వచ్చేవరకు కేసీఆర్‌కు సోయిలేదు. గుజరాత్‌ మోడల్‌ పైన పటారం లోన లొటారం అన్నారు. కేటీఆర్‌ సబర్మతి వెళ్లి బాగుంది అనడం నిజం కాదా? ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద కేంద్రం ఇచ్చిన నిధులతో ఎన్ని ఇళ్లు కట్టారో లెక్క తేల్చండి. అమృత్‌ పథకం డబ్బుల్ని కేసీఆర్‌ దారి మళ్లించారు. దిల్లీలో మరణించిన రైతులకు ఇస్తానన్న డబ్బులు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో తెరాసకు 95 సీట్లు వస్తాయంటున్నారు. 9 పక్కన 5 తీసేస్తే సరిపోతుంది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో భాజపాకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయి. కానీ వచ్చేది భాజపా ప్రభుత్వమే’’ అని సంజయ్‌ అన్నారు.

"సీఎం కేసీఆర్ అంబేడ్కర్‌ను అవమానించారు. రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని చెప్పి.. కేసీఆర్ ఏం కోరుకుంటున్నారు?. రాజ్యాంగంపై వివాదాస్పదంగా ఎలా మాట్లాడుతారు?. ప్రజలు, రైతుల కోసం తెచ్చిన బడ్జెట్ సీఎంకు నచ్చదు."

- బండి సంజయ్​, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

Bandi sanjay: 'సీఎం కేసీఆర్ అంబేడ్కర్‌ను అవమానించారు'

ఇదీచూడండి:

Last Updated : Feb 2, 2022, 6:39 AM IST

ABOUT THE AUTHOR

...view details