Telangana Assembly Elections 2023 : కర్ణాటక ఎన్నికల ఫలితాలు, నేతల మధ్య విభేదాలు, పార్టీ సంస్థాగత మార్పులతో గందరగోళంలో ఉన్న కమలనాథుల్లో... నూతన ఉత్తేజం నింపేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం సమాలోచనలు చేస్తోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో పూర్తిగా ప్రజల్లోనే ఉండాలని నిర్ణయించింది. వంద రోజుల ఎన్నికల ప్రణాళికతో ముందుకు వెళ్లాలని యోచిస్తోంది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలంటే విభేదాలు పక్కనపెట్టి.. సమష్టిగా పనిచేయాలని భావిస్తోంది. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన పదాధికారుల సమావేశంలో పలు కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.
BJP Strategies for Telangana Assembly Elections 2023 :రాష్ట్రంలోని 31 ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో విజయమే లక్ష్యంగా పని చేయాలని... వారం రోజుల పాటు ఇంటింటికి బీజేపీ, మహాజన్ సంపర్క్ అభియాన్, జులై 16న టిఫిన్ బాక్స్ కార్యక్రమాలు నిర్వహించాలని యోచిస్తోంది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంఛార్జిలను నియమించిన కమలం పార్టీ... పలు కార్యక్రమాలు నిర్వహించింది. అసెంబ్లీలోని 119 స్థానాల్లో.. 31 స్థానాలు ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌గా ఉన్నాయి. ఈ స్థానాల్లో అత్యధిక సీట్లు బీజేపీ గెలిస్తే రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరవేసేందుకు సులభమవుతుందని కమలదళం భావిస్తోంది. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు కేసీఆర్ చేసిన మోసం.. కేంద్రం చేసిన సహాయం, కేంద్రమంత్రి వర్గంలో వీరికి ఇచ్చిన ప్రాధాన్యాలను అస్త్రాలుగా చేసుకుని.. పార్టీని బలోపేతానికి ప్లాన్ చేస్తోంది. ఈ నియోజకవర్గాల్లో నిర్వహించే బహిరంగ సభలకు ... ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాలకు చెందిన కేంద్రమంత్రులు, జాతీయ నాయకులను పిలిపించేందుకు సమాలోచనలు చేస్తోంది.