తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు.. 27న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు..

Bjp Focus On 2023 Elections : రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా రచించాల్సిన వ్యూహాలపై కమలదళం దృష్టి సారించింది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తే అధికారం సునాయాసమని నేతలు భావిస్తున్నారు. ఇదే అంశాన్ని సుసాధ్యం చేసేందుకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. మరోవైపు రుణమాఫీ, ధరణిలో లోపాలు, రైతు సమస్యలపై ఈ నెల 27న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు భాజపా పిలుపునిచ్చింది.

Bjp Focus On Elections
బీజేపీ ఎన్నికల వ్యూహాలు

By

Published : Dec 17, 2022, 9:43 AM IST

రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు

Bjp Focus On 2023 Elections : క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉంటేనే రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రావడం సాధ్యమని కాషాయదళం భావిస్తోంది. ఇందుకోసం బూత్ స్థాయి నుంచి పార్టీని మరింత పటిష్ఠం చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు వచ్చే నెల 7న జాతీయాధ్యక్షుడు నడ్డా రాష్ట్రవ్యాప్తంగా బూత్ సభ్యులతో వర్చువల్‌గా సమావేశం కానున్నారు. రాష్ట్రంలో మొత్తం 35,700 బూత్‌లు ఉండగా.. మొత్తం 7 లక్షల 14 వేల మందితో నడ్డా మాట్లాడనున్నారు. వచ్చే ఎన్నికలపై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. సంస్థాగత బలోపేతంపై జాతీయ నాయకత్వం దృష్టి సారించడంతో.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రంగంలోకి దిగనున్నారు.

జనవరి 15 నుంచి 30 వరకు నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేపట్టనున్నారు. ఒక్కో రోజు మూడు నియోజకవర్గాల్లో పర్యటించేలా కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. పార్టీ బలోపేతంతో పాటు కమిటీల ఏర్పాటుపై దృష్టి సారించనున్నారు. ఈ నెల 19 నుంచి 21 వరకు అన్ని జిల్లాల్లో జిల్లా పదాధికారుల సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. రైతు రుణమాఫీ, ధరణిలో లోపాలు, రైతు సమస్యలపై ఈ నెల 27న అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించింది. బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర పూర్తి చేసుకున్న మరుసటి రోజే.. తొలుత రాష్ట్ర కోర్ కమిటీ భేటీ జరిగింది.

అందులో తాజా రాజకీయాలు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం 8 కీలకాంశాలపై రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గాల ఇంఛార్జ్‌లు సమావేశమయ్యారు. పార్టీ జనాల్లోకి విస్తృతంగా వెళ్లేలా చేపట్టాల్సిన నిర్ణయాలు, సంస్థాగత బలోపేతం, జీ-20 సదస్సుకు అధ్యక్షత వహించడం, ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్‌పై చర్చ జరిగింది. మన్ కీ బాత్, ప్రజా సంగ్రామ యాత్ర స్పందన, సామాజిక మాధ్యమాలు, అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాల ఏర్పాటుపై చర్చించారు. వచ్చే డిసెంబర్‌లోపు అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

అన్ని గ్రామాల్లో బూత్‌ల వారీగా సామాజిక మాధ్యమాల గ్రూపులు ఏర్పాటు చేసి.. ప్రజలకు చేరువకావడంపై దృష్టి సారించాలని దిశా నిర్దేశం చేశారు. పదాధికారుల సమావేశానికి హాజరుకాని ఐదుగురు జిల్లా అధ్యక్షులపై తరుణ్‌చుగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భువనగిరి జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్‌రావు, పెద్దపల్లి నుంచి సోమారపు సత్యనారాయణ, నాగర్ కర్నూల్ నుంచి సుధాకర్, మరో రెండు జిల్లాల నుంచి ఇద్దరు అధ్యక్షులు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని తరుణ్​చుగ్‌ ఆదేశించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details