BJP Election planings in telangana: ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్రకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభించింది. పట్టణ ప్రాంతానికే పరిమితమైన పార్టీని గ్రామీణ స్థాయిలో బలోపేతం చేసేందుకు ఈ యాత్ర కృషి చేసింది. ఐదు విడతల్లో సాగిన ప్రజా సంగ్రామ యాత్ర పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపింది. ఆరో విడత పాదయాత్రకు సిద్ధమవుతున్న తరుణంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని జోరుగా ప్రచారం జరగడంతో బ్రేక్ పడింది. ఎన్నికలు సమీపిస్తోన్న వేళ పాదయాత్ర బదులు రథయాత్ర చేపట్టాలని భావిస్తోంది. ఇందు కోసం ఐదు రథాలను సిద్ధం చేయిస్తోంది. ఏప్రిల్ ప్రథమార్థంలో రథయాత్రలు ప్రారంభించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
12న రాష్ట్రానికి అమిత్ షా : ఇదిలా ఉండగా తెలంగాణపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రత్యేక దృష్టి సారించారు. శాసనసభ ఎన్నికల బాధ్యతలు... తన భుజాన వేసుకున్నారు. కర్ణాటక ఎన్నికలు ముగియగానే అమిత్ షా... తెలంగాణలో మకాం వేస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ నేతల మధ్య సమన్వయంపై దృష్టిపెట్టిన ఆయన.. క్రమం తప్పకుండా ఒక నేత ఇంట్లో సమావేశం కావాలని ఆదేశించారు. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరే వారిని సమన్వయం చేసే బాధ్యతను పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి సునీల్ బన్సల్‌కు అప్పగించారు. ఇటీవలె.... తెలంగాణ కోర్ కమిటీ సభ్యులతో దిల్లీలో సమావేశమైన అమిత్ షా ఎన్నికలకు సన్నద్ధంకావాలని దిశానిర్థేశం చేశారు. ఈ నెల 12న అమిత్ షా తెలంగాణ పర్యటనకు రానున్నారు. హైదరాబాద్‌లో హాకీంపేటలో అధికారిక కార్యక్రమంలోపాల్గొన్న తర్వాత సంగారెడ్డిలో నిర్వహించే మేధావుల సదస్సులో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
రథయాత్రలకు సిద్ధమవుతున్న బీజేపీ :బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రకు ముందస్తు ఎన్నికల ప్రచారం బ్రేక్ పడేలా చేసింది. ఐదు విడతల్లో సాగించిన పాదయాత్ర క్షేత్రస్థాయిలో పార్టీ బలోపతంకు దోహాదం చేసింది. పట్ణణానికే పరిమితమైన పార్టీని పల్లెపల్లెకు తీసుకెళ్లింది. యువతను బీజేపీ వైపుకు తిప్పుకునేందుకు ఉపయోగపడింది. అధికార పార్టీకి ధీటుగా బీజేపీ ఎదుగదలలో ప్రజా సంగ్రామ యాత్రకు ప్రత్యేక స్థానం ఉంది. ఇదే ఒరవడిని ఎన్నికల వరకు సాగించాలని రాష్ట్ర నాయకత్వం భావించింది. ఆరో విడత పాదయాత్రకు సన్నద్ధం అవుతున్న క్రమంలో ముందస్తు ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో ఆరవ విడత యాత్రకు బ్రేక్ పడింది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో పాదయాత్ర చేస్తే రాష్ట్ర స్థాయిలో పార్టీని మానిటరింగ్ చేసేందుకు ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన రాష్ట్ర నాయకత్వం రథయాత్రలను చేపట్టాలని నిర్ణయించింది.
ఈ రథయాత్రను బండి సంజయ్ ఒక్కరే చేపట్టకుండా ముఖ్య నేతలు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందు కోసం ఐదు రథాలను సిద్ధం చేయిస్తోంది. ఏప్రిల్ తొలి వారంలో రథయాత్రలను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ రథయాత్రలను పార్లమెంట్ల వారీగా చేపట్టేలా ప్లాన్ చేస్తోంది. పార్లమెంట్‌లోని ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక రోజు యాత్ర సాగేలా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తోంది. ముఖ్యనేతలు చేసే రథయాత్రల్లో రాష్ట్ర కమల దళపతి బండి సంజయ్ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాల్గొనేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజా సంగ్రామ యాత్ర కంటే ధీటుగా రథయాత్రలను విజయవంతం చేయాలని రాష్ట్ర నాయకత్వం యోచిస్తోంది.
ఇవీ చదవండి: