ముఖ్యమంత్రి కేసీఆర్... అసెంబ్లీ, బహిరంగ సభలలో మాట్లాడిన మాటలకు విలువ ఉండటం లేదని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ (Nvss Prabhakar) ఆరోపించారు. ఎస్సీ, గిరిజనులను వంచిస్తూ అవమానాలకు గురి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రగతి పద్దును నీరుగార్చారని... కేటాయింపులు ఖర్చు చేయకుండా మోసం చేసి అసెంబ్లీని కూడా అవమానపర్చారని మండిపడ్డారు.
మాటల గారడి...
ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr) మాటల గారడి చేస్తున్నారని... ఆది అనేక సందర్భాల్లో బయటపడుతోందన్నారు. ఈటల రాజేందర్ నియోజకవర్గంలో మూడెకరాల భూమి కేవలం12 మందికి మాత్రమే పంపణీ అయిందని... ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కూడా 200 మంది కూడా ఇవ్వలేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మూడెకరాల భూపంపిణీ కనుమరుగు అయ్యిందని పేర్కొన్నారు. దళిత బంధు ఇప్పటి వరకు 15 మందికి మాత్రమే ఇచ్చారని... మరోసారి దళితులను మోసం చేయాలని చూస్తే కేసీఆర్ను దళితులు వదిలిపెట్టరని హెచ్చరించారు.
ఎన్నికలపుడే గొర్రెలు, బర్రెలు...
దళితబంధు పథకం అమలు చేస్తానని చెబుతున్నా... ముఖ్యమంత్రి మాటలు సాధ్యం అయ్యేది కాదన్నారు. ఎస్సీ కార్పొరేషన్ నిధులు అనుకున్న మేర పంపిణీ జరగలేదన్నారు. శాసనసభ నిర్వహించి దళిత బంధుపై పూర్తి స్థాయిలో చర్చించి... చట్టం చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఆర్థిక విధానాల వల్ల రాష్ట్రం దివాళా తీసిందని ఆరోపించారు. గొర్రెలు, బర్రెలు ఎన్నికలు వచ్చినప్పుడు గుర్తుకు వస్తాయన్నారు.
బలహీన వర్గాలను, దళితులను, గిరిజనులను పూర్తిగా వంచించడం, మోసగించడం వారిని అవమానించడం ఏడేళ్లలో ముఖ్యమంత్రికే చెల్లింది. చట్టసభల్లో చట్టం చేసిన ప్రగతిపద్దును నీరుగార్చిన ఘనత ఈ ముఖ్యమంత్రిది. ఈ ఏడేళ్లలో బడ్జెట్లో దళితులకు ఖర్చుపెట్టాల్సిన వాటాను ఖర్చు పెట్టకుండా మోసం చేశారు. ఇది అసెంబ్లీనే అవమానపరిచినట్లు పేర్కొంటున్నా. ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల గారడి చేస్తున్నారు. ఇది అనేక సందర్భాల్లో బయటపడింది. దళితులకు మూడు ఎకరాల భూమి పేరుతో మోసం చేశారు.
-- ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు
'అసెంబ్లీ నిర్వహించి... దళితబంధుపై చట్టం చేయండి' ఇదీ చూడండి: BANDI SANJAY:'రాష్ట్రంలో దోపిడీ, నియంత, కుటుంబ, గడీల పాలన నడుస్తోంది'