నాగార్జునసాగర్ ఉపఎన్నికలో మద్యం ఏరులై పారుతోందని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. ఎన్నికలు ముగిసే వరకు మద్యాన్ని నిషేధించాలని అధికారులను కోరారు. సాగర్ ఉపఎన్నికలో తెరాస, కాంగ్రెస్‌ల కుమ్మక్కు రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగుల జీవితాలతో సీఎం కేసీఆర్ చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు.
నిరుద్యోగుల ఆత్మహత్యలకు ముఖ్యమంత్రే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అవినీతి, హత్యలు పెరిగిపోతున్నాయని విమర్శించారు. ఏకంగా మంత్రులే ఫోన్ చేసి రియల్టర్లను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే వీటిపై విచారణ జరిపించాలన్నారు. ప్రతి పోలింగ్ బూత్ కేంద్రంగా సాగర్ ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర నాయకత్వం పాల్గొంటుందని ప్రభాకర్ స్పష్టం చేశారు.