18 ఏళ్లు నిండిన దేశ ప్రజలకు ఉచిత వ్యాక్సిన్ వేస్తామని ప్రధాని ప్రకటించడం చాలా సంతోషకరమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. తెలంగాణ ప్రజల తరపున ప్రధానికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. 70 ఏళ్ల స్వాతంత్య్ర చరిత్రలో వ్యాక్సిన్‌ను తయారు చేసిన ఘనత ప్రధాని మోదీదేనని...స్వదేశీ పరిజ్ఞానాన్ని ప్రధాని పెంపొదింపజేస్తున్నారన్నారు. స్వదేశీ వ్యాక్సిన్ తయారు చేసుకోకలేకపోతే లక్షల కోట్లు నష్టపోయే వాళ్లమని ఆయన అన్నారు. వ్యాక్సినేషన్‌లో భారత్ మూడోస్థానంలో ఉందని... తెలంగాణకు ఇప్పటికే కేంద్రం 80లక్షల వ్యాక్సిన్లు ఇచ్చిందని తెలిపారు. జూన్‌లో 20లక్షలు, జులైలో 20లక్షల వ్యాక్సిన్ తెలంగాణకు వచ్చే అవకాశం ఉందన్నారు.
వైద్యులను నియమించుకోవాలి..
మోదీ నిర్ణయం పట్ల పక్కా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభినందనలు చెబుతుంటే కేసీఆర్ పత్తా లేకుండా పోయాడని బండి సంజయ్ విమర్శించారు. ప్రధాని ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తానని ప్రకటించడంతో కేసీఆర్ ప్రభుత్వం బాధాతప్త హృదయంతో ఉందని ఆయన ఆరోపించారు. 2వేల 5వందల కోట్లు కేటాయించానన్న కేసీఆర్... ఎక్కడికి పోయాడని ప్రశ్నించారు. 5వందల కోట్లను కేటాయిస్తే శాశ్వత వైద్యులు, సిబ్బందిని నియమించుకోవచ్చన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి వైద్యులు, సిబ్బంది నియామాకానికి చర్యలు చేపట్టాలన్నారు.