Bandi Sanjay at SC Morcha State Executive Meeting: ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కేసీఆర్ సర్కార్‌పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్ దళిత ద్రోహి అని ధ్వజమెత్తారు. కేసీఆర్ అధికారం చేపట్టిన నాటి నుంచి దళితులపై దాడులు పెరిగిపోయాయని విమర్శించారు. అంబేడ్కర్ జయంతి, వర్ధంతులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పించలేదన్నారు.
Bandi Sanjay fires on CM KCR: దళిత నియోజకవర్గాల పట్ల కేసీఆర్ నిర్లక్యంగా వ్యవహరించారని బండి మండిపడ్డారు. సీఎం కేసీఆర్ పొగిడిన శ్రీలంక, చైనా, పాకిస్థాన్ దేశాల పని అయిపోయిందన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ సర్కారుతోనే సాధ్యమని తెలిపారు. కేసీఅర్ బిడ్డను కాపాడేందుకు మంత్రివర్గం మొత్తం దిల్లీ పోయిందన్న బండి.. సీఎం మాత్రం రాష్ట్రంలో మహిళలపైన హత్యలు, అత్యాచారాలు జరిగిన పట్టించుకోవడం లేదని విరుచుకుపడ్డారు.
కేటీఆర్‌ను మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలి: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ వలన వేలాది మంది విద్యార్థులు రోడ్డున పడ్డారని వివరించారు. ఇందుకు సంబంధించిన మంత్రి కేటీఆర్‌ను మంత్రి వర్గం నుంచి భర్తరఫ్ చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. దీనిని సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. కష్టపడి చదివి నష్టపోయిన నిరుద్యోగులకు రూ.లక్ష నష్ట పరిహారం ఇవ్వాలన్నారు. రేపు రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు దీక్ష చేస్తామని తెలిపారు.