తెలంగాణ

telangana

ETV Bharat / state

Bjp vs TRS: రణరంగాన్ని తలపించిన బండి టూర్​.. అడుగడుగునా అడ్డగింత - telangana news updaets

రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుపై తెరాస-భాజపా మధ్య రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. అగ్రనేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసిన ఈ అంశం.... ఇప్పుడు క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల మధ్య ఉద్రిక్తతలను రాజేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగిన బండి సంజయ్‌ పర్యటన... తెరాస-భాజపా శ్రేణుల పోటాపోటీ ఆందోళనలతో దద్దరిల్లింది. మిర్యాలగూడలో జరిగిన పర్యటన యుద్ధాన్ని తలపించింది. సూర్యాపేట జిల్లా అనాజ్​పూర్​లో సంజయ్​ కాన్వాయ్​ను తెరాస శ్రేణులు అడ్డుకోగా.. అక్కడ మరోసారి తీవ్ర భాజపా, తెరాస శ్రేణుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. అక్కడ నుంచి నిరసన మధ్యే తాళ్లకాంపాడు వెళ్లిన బండి సంజయ్‌కు అక్కడా నిరసన సెగ తగిలింది. కోడిగుడ్లు, రాళ్లు రువ్విన నిరసనకారులు.. బండి సంజయ్‌ వెనక్కి వెళ్లాలంటూ నినాదాలు చేశారు.

BJP STATE PRESIDENT BANDI SANJAY NALGONDA TOUR OVER ALL STORY
Bjp vs TRS: రణరంగాన్ని తలపించిన బండి టూర్​.. తెరాస,భాజపా శ్రేణుల బాహాబాహీ

By

Published : Nov 15, 2021, 7:54 PM IST

Updated : Nov 15, 2021, 10:40 PM IST

Bjp vs TRS: రణరంగాన్ని తలపించిన బండి టూర్​.. తెరాస, భాజపా శ్రేణుల బాహాబాహీ

ధాన్యం కొనుగోళ్లు పరిశీలన కోసం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో చేపట్టిన పర్యటన ఉద్రిక్తతలకు దారితీసింది. నల్గొండ పట్టణం, మిర్యాలగూడ నియోజకవర్గం వేములపల్లి మండలం శెట్టిపాలెంలో రెండుచోట్ల భాజపా-తెరాస శ్రేణులు బాహాబాహీకి దిగాయి. ముందుగా నల్గొండలో ఆర్జాలబావి ఐకేపీ సెంటర్‌లో సంజయ్‌ పర్యటనను వ్యతిరేకిస్తూ తెరాస శ్రేణులు నల్లజెండాలతో 'బండి సంజయ్ గో బ్యాక్' అంటూ నినాదాలు చేశారు. దీంతో తెరాస-భాజపా శ్రేణులు బాహాబాహీకి దిగారు. పరిస్థితి చేయిదాటకుండా ఐకేపీ కేంద్రం నుంచి పోలీసులు ఇరువర్గాలను పంపించారు.

రాళ్ల దాడికి సిద్ధమే..

ఉద్రిక్త వాతావరణం నడుమే బండి సంజయ్ ధాన్యం రాశులను పరిశీలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ సమస్య పరిష్కరించకుండా తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. తెరాస కార్యకర్తలు రైతుల్లా వచ్చి గొడవ చేస్తున్నారని మండిపడ్డారు. రైతులపై రాళ్లు, కోడిగుడ్లు వేస్తారా? అని నిలదీశారు. శాంతిభద్రతల సమస్యను సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల కోసం రాళ్ల దాడికి సిద్ధమేనని స్పష్టం చేశారు.

ఇవాళ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. రైతుల దృష్టి మళ్లించడానికి... భయానక వాతావరణం సృష్టించాలనే ప్రయత్నంతో శాంతిభద్రతల సమస్యలు సృష్టించాలని ప్రయత్నం చేస్తే దానికి భయపడే పార్టీ భాజపా కాదు. దానికి భయపడే కార్యకర్తలు భాజపా కార్యకర్తలు కాదు. రాష్ట్రముఖ్యమంత్రి బయటకు రావాలి. బయటకు వచ్చి కొనుగోలు కేంద్రాన్ని చూస్తే... మాకెందుకు ఈ ఇబ్బంది. ఏమన్నా అంటే కేంద్రం అంటారు. ఎఫ్​సీఐ, రాష్ట్రానికి జరిగిన ఒప్పందం ఏంటి? 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాలి. మీరు కొన్నది ఎంత? 7 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నట్లు ప్రభుత్వమే చెప్తోంది. రైతుల కోసం రాళ్ల దాడికైనా సిద్ధమే.

-బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

బండి సంజయ్‌కు సవాల్

బండి సంజయ్ రాకకు ముందే ఐకేపీ కేంద్రాన్ని తెరాస ఎమ్మేల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పరిశీలించారు. వర్షాకాలం సీజన్‌లో పండిన ప్రతిధాన్యపు గింజను రాష్ట్రప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని... యాసంగి ధాన్యం కొంటామని కేంద్రప్రభుత్వం హామీ ఇస్తుందా? అని బండి సంజయ్‌కు సవాల్ విసిరారు.

నినాదాలు, నిరసనలతో దద్ధరిల్లింది

నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం కుక్కడంలోనూ బండి సంజయ్‌ తెరాస శ్రేణుల నిరసనల నడుమే రైతులను పరామర్శించారు. అనంతరం మిర్యాలగూడ నియోజకవర్గంలోని వేములపల్లి శెట్టిపాలెంలో జరిగిన పర్యటన రణరంగాన్ని తలపించింది. వందలాదిగా తరలివచ్చిన జనం మధ్యన... ఇరువర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. ముఖ్యంగా పోలీసుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. తెరాస శ్రేణులకు బండి సంజయ్‌కి 20 మీటర్ల దూరం కూడా లేకపోవడంతో తెరాస శ్రేణులు...నల్ల జెండాలతో నిరసన చేపట్టి కోడిగుడ్లు, టమాటాలు విసిరారు. ఆగ్రహించిన భాజపా కార్యకర్తలు ఎదురుదాడికి దిగారు. తెరాస, భాజపా కార్యకర్తల పోటాపోటీ నినాదాలు, నిరసనలతో ఆ ప్రాంతం దద్ధరిల్లింది.

తెరాస కార్యకర్తలు నినాదాలు

అంతకుముందు కొనుగోలు కేంద్రంలో మాట్లాడిన మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు రైతు పర్యటన పేరుతో బండి సంజయ్.. రైతులను అయోమయంలో పడేయవద్దని కోరారు. యాసంగిలో దొడ్డు రకం ధాన్యం కొనుగోలు చేసేలా.. కేంద్ర పెద్దలతో మాట్లాడి అనుమతి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అనంతరం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం చిల్లేపల్లిలోనూ బండి కాన్వాయ్ ఎదుట తెరాస కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశాయి. మూసీ వంతెనపై బైఠాయించి బండి సంజయ్‌ వెనక్కి వెళ్లాలని తెరాస కార్యకర్తలు నినాదాలు చేశారు.

బండి వెంట వస్తున్న కార్లపై రాళ్ల దాడి

బండి సంజయ్‌ వెంట వస్తున్న కార్లపై రాళ్ల దాడి జరిగింది. ఆందోళనకారుల రాళ్ల దాడిలో పలు కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. బండి సంజయ్‌ వెనక్కి వెళ్లాలని తెరాస కార్యకర్తల నినాదాలు చేయటంతో ఆయన పోలీసుల బందోబస్తు మధ్య మిర్యాలగూడ నుంచి చిల్లేపల్లి మీదుగా గడ్డిపల్లి వెళ్లారు. పటిష్ఠ బందోబస్తు మధ్య గడ్డిపల్లిలో ఐకేపీ కేంద్రాన్ని సందర్శించిన బండి సంజయ్‌... అనంతరం సూర్యాపేట బయలుదేరారు.

మరోసారి ఉద్రిక్తత..

సూర్యాపేట జిల్లాలో బండి సంజయ్‌ పర్యటనలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. గడ్డిపల్లి నుంచి సూర్యాపేట మార్గంలో తెరాస శ్రేణుల నిరసన వ్యక్తం చేశాయి. పెన్‌పహాడ్‌ మండలం అనాజ్‌పూర్‌లో భాజపా కార్యకర్తలపైకి నిరసనకారులు రాళ్లు, కోడిగుడ్లు విసిరారు. అనాజ్‌పూర్‌లో సంజయ్‌ కాన్వాయ్‌ను సైతం తెరాస శ్రేణులు అడ్డుకున్నాయి. ఇక్కడ భాజపా, తెరాస కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. నిరసన మధ్యే తాళ్లకాంపాడు వెళ్లిన బండి సంజయ్‌కు అక్కడా నిరసనసెగ తగిలింది. కోడిగుడ్లు, రాళ్లు రువ్విన నిరసనకారులు.. బండి సంజయ్‌ వెనక్కి వెళ్లాలంటూ నినాదాలు చేశారు. పోలీసుల బందోబస్తు మధ్య బండి సంజయ్​ సూర్యాపేట బయలుదేరి వెళ్లారు.

Last Updated : Nov 15, 2021, 10:40 PM IST

ABOUT THE AUTHOR

...view details