Bandi Sanjay Fires on cm kcr ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి నిరుద్యోగులు పరీక్షలకు సన్నద్ధమవుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీని నిరసిస్తూ హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద బీజేపీ ఏర్పాటు చేసిన నిరుద్యోగుల మహా ధర్నాలో బండి సంజయ్ పాల్గొన్నారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీని నిరసిస్తూ.. 'మా నౌకరీలు మాగ్గావాలే' నినాదంతో ఇందిరా పార్కు ధర్నాచౌక్ వేదికగా ధర్నా నిర్వహించారు.
'' యూనివర్సిటీలు పశువుల కొట్టాలలాగా మారిపోయాయి. 30 లక్షల మంది యువకుల గురించి మాట్లాడని కేసీఆర్... రాహుల్ గాంధీ కోసం బ్లాక్ డే అంటాడా? రెండు నెలల నుండి బీఆర్ఎస్ పత్తా లేకుండా పోయింది. అన్ని యూనివర్సిటీల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడండి. ఎన్నికలు దగ్గర పడితేనే కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తామని అంటారు. నాకు, రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. కేటీఆర్‌కి నోటీసులు ఎందుకు ఇవ్వట్లేదు? ఇంత వరకు సిట్ దర్యాప్తు చేసిన కేసులు ఏమయ్యాయి? '' - బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇచ్చే ధైర్యం సిట్‌కు లేదని బండి సంజయ్ ఆరోపించారు. నయీం కేసులో వేసిన సిట్ ఏమైందో సీఎం కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ కేసు, మియాపూర్ భూములపై వేసిన సిట్ ఏమైందో సీఎం కేసీఆర్ చెప్పాలని ధ్వజమెత్తారు. లీకేజ్ కేసులో పెద్దపెద్ద వాళ్లను వదిలేసి చిన్నవాళ్లను అరెస్టు చేశారని మండిపడ్డారు.
''టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ సభ్యులకు నోటీసులు ఎందుకు ఇవ్వట్లేదు? కేసీఆర్ 30 లక్షల మంది విద్యార్థుల ఉసురు పోసుకుంటున్నారు. నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వడం లేదు. ఏ శాఖలో ఏం జరిగినా కేటీఆర్ ఎందుకు స్పందిస్తారు? కేటీఆర్ షాడో ముఖ్యమంత్రి లాగా తయారయ్యారు. ముఖ్యమంత్రి కుటుంబాన్ని కాపాడడం కోసమే కేబినెట్ పనిచేస్తోంది. 30 లక్షల మంది నిరుద్యోగులు ఏకమై కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ నుండి తరిమివేయాలి. బీజేపీ ప్రభుత్వం రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. తెలంగాణ ఉద్యమంలో పోరాడినాం. కేసీఆర్‌కి ఎందుకు భయపడుతున్నాం?'' - బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు