సీఎం కేసీఆర్ ఎందుకు ధర్నా చేశారో ఆయనకే తెలియదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay Fires on KCR)ఎద్దేవా చేశారు. కేసీఆర్ దీక్ష(KCR dhrana) చేస్తే... మోదీ సాగుచట్టాలు రద్దు చేశారనటం విడ్డూరమని విమర్శించారు. కేసీఆర్ దీక్ష చేసింది రాష్ట్ర రైతుల కోసమా, పంజాబ్ రైతుల కోసమా? అని ప్రశ్నించారు.
ఎప్పుడూ ఫామ్‌హౌస్‌లో ఉండే సీఎం కేసీఆర్‌ను బయటికి రప్పించామని బండి సంజయ్ అన్నారు. ధర్నా చౌక్(Dharna chowk) వద్దన్న కేసీఆర్... అదే ధర్నా చౌక్‌లో కూర్చున్నారని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వల్ల రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైసు మిల్లర్ల కోసమే సీఎం కేసీఆర్ ధర్నా చేశారని ఆరోపించారు. రైతుల, భాజపా నేతలపై రాళ్ల దాడి చేయించారని మండిపడ్డారు.
'కేసీఆర్ దీక్ష చేసింది రాష్ట్ర రైతుల కోసమా, పంజాబ్ రైతుల కోసమా?'
చాలా విషయాల్లో భాజపా విజయం సాధించింది. ఎప్పుడూ ఫామ్‌హౌస్‌లో ఉండే సీఎం కేసీఆర్‌ను బయటకు రప్పించాం. ధర్నా చౌక్ వద్దన్న కేసీఆర్.. అదే ధర్నా చౌక్‌లో కూర్చున్నారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతోంది. దీనివల్ల రైతులు నష్టపోతున్నారు. అధికారులను కొనుగోలు కేంద్రాలకు పంపి యుద్ధ ప్రాతిపదికన కొనుగోళ్లు చేపట్టాలి. మేము రైతుల కోసం ఆలోచిస్తున్నాం. తెరాస మాత్రం కొంత మంది రైస్ మిల్లర్ల కోసం ఆలోచిస్తోంది. రాజకీయ దురుద్దేశంతోనే రైతులు, భాజపా నేతలపై రాళ్ల దాడి చేయించారు. వానాకాలం 40లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం, 60లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటామని కేంద్రం లేఖ ఇచ్చిందా...లేదా? వరద నీటిలో వడ్డు కొట్టుకుపోయి రైతులు ఇబ్బంది పడుతుంటే సీఎం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల రైతులు చనిపోతే ఇక్కడ రూ.20 లక్షలు ఇవ్వరంట. పంజాబ్‌లో చనిపోతే రూ. 3 లక్షలు ఇస్తారంట. కేంద్ర వ్యవసాయ చట్టాలని సీఎం కేసీఆర్ మొదట వ్యతిరేకించారు. తర్వాత సమర్ధించారు. ఇటీవల కాలంలో అనేక మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆర్టీసీ సమ్మె సమయంలో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. రాష్ట్ర సాధన కోసం 1400 మంది చనిపోయారు. వారికెందుకు రూ.20 లక్షల పరిహారం ఇవ్వలేదు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ. 20 లక్షల పరిహారం ఇవ్వాలి. గడిచిన ఏడేళ్లలో ఏ ఒక్క రైతును అయినా అదుకున్నవా...? ఏ రాష్ట్రంలో లేని లొల్లి ఇక్కడ ఎందుకు...? - బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
ఇదీ చూడండి:స్పీకర్ పోచారం మనవరాలి వివాహం.. వేడుకలో పక్కపక్కనే కూర్చున్న కేసీఆర్, జగన్