రాష్ట్రంలో తెరాసకు భాజపానే ప్రత్యామ్నాయం అనే భావన ప్రజల్లో ఏర్పడిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) అన్నారు. భాజపా చేపడుతున్న పాదయాత్రతో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించబోతున్నాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అరాచక నియంత గడీల పాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు. పాదయాత్ర ద్వారా ముఖ్యమంత్రి సహా మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి బాగోతాన్ని ప్రజల్లోకి తీసుకువెళతానని తెలిపారు.
71 శాతం మంది ఓటర్లు భాజపా వైపే
2023లో భాజపా(BJP) ఆధ్వర్యంలో పేదల ప్రభుత్వం రాబోతుందనే ధీమా ప్రజల్లో కలిగిందన్నారు. పాదయాత్రలో మంత్రులు, జాతీయ నాయకులు కూడా పాల్గొంటారని పేర్కొన్నారు. హుజూరాబాద్ ఎన్నికల్లో తెరాసకు అభ్యర్థే కరవయ్యారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వర్గాలతో చేయించిన సర్వేలోనూ 71 శాతం మంది ఓటర్లు భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మద్దతు ఇస్తున్నట్లు తేలిందని తెలిపారు. సర్వేలతో బెంబేలెత్తిన కేసీఆర్... వార్డు మెంబర్ మొదలు ప్రజాప్రతినిధులందరికీ లక్షలాది రూపాయల ఆశ చూపి తెరాసలోకి లాక్కుంటున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి:ఉపాధి హామీ అధికారిపై సర్పంచ్ పెట్రోల్‌తో దాడి