హుస్నాబాద్‌లో బండి సంజయ్ ముంగిపు సభ హుజూరాబాద్ ఉపఎన్నికకు నోటిఫికేషన్ (Huzurabad by election notification) వెలువడటంతో అధికార తెరాసపై విమర్శల తీవ్రతను భాజపా (Bjp) మరింత పెంచింది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర (Bandi Sanjay Praja Sangrama yatra) 33వ రోజు కొనసాగింది.
రవికిషన్...
ఆ యాత్రలో ఉత్తరప్రదేశ్ ఎంపీ, సినీనటుడు రవికిషన్ పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఆయన రాష్ట్రంలో నిరుద్యోగులు, పేద ప్రజలను తెరాస సర్కారు మోసం చేసిందని విమర్శించారు. తెలంగాణ ప్రజలు పేదరికంలో మగ్గుతూ ఉంటే ముఖ్యమంత్రి కుటుంబం మాత్రం ధనవంతులయ్యారని ఆరోపించారు. సిరిసిల్లలో వర్షానికి ఇల్లు, కార్లు కొట్టుకుపోతుంటే పట్టించుకోని కేటీఆర్ (KTR) తనపై విమర్శలు చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. హుజూరాబాద్ గడ్డమీద కాషాయ జెండా ఎగరవేసి ప్రధాని మోదీ (Pm Modi)కి బహుమతిగా ఇస్తామని బండి పునరుద్ఘాటించారు. 2023 ఎన్నికల్లో రాష్ట్రంలో భాజపా అధికారం చేపట్టడం తధ్యమని ధీమా వ్యక్తం చేశారు.
అడ్డదారుల్లో తెరాస...
హుజూరాబాద్ పోరులో తెరాస ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తుందని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇంద్రసేనా రెడ్డి (Indrasena reddy) ఆరోపించారు. దొంగ ఓట్లను నమోదు చేసే ప్రక్రియ వేగవంతంగా సాగుతోందని హైదరాబాద్ బుద్ధభవన్‌లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ (Ec Shashank Goyal)ను కలిసి ఫిర్యాదు చేశారు. అధికార పార్టీకి చెందిన నాయకులు, ముఖ్యమంత్రి కేసీఆర్ హోర్డింగ్స్, ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని కోరారు. తెరాస అడ్డదారుల్లో గెలిచేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించిన ఇంద్రసేనారెడ్డి ఓటర్ జాబితా తయారీ ప్రక్రియలో అవకతవకలకు పాల్పడుతున్న అధికారులను విధుల నుంచి తప్పించాలని కోరారు.
ముగింపు సభ హుస్నాబాద్‌లో...
ఉపఎన్నిక షెడ్యూల్ వెలువడడటంతో బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను హుస్నాబాద్(Husnabad)లో నిర్వహిస్తున్నట్లు భాజపా ప్రకటించింది. ముందుగా హుజూరాబాద్‌లో ముగింపు సభ నిర్వహించాలనుకున్నా షెడ్యూల్ వెలువడటంతో ఆ నిర్ణయం తీసుకున్నట్లు పాదయాత్ర ప్రముఖ్ మనోహర్ రెడ్డి (Pramuk Manohar reddy) తెలిపారు. వచ్చేనెల 2 వరకు సిద్దిపేట జిల్లాలోనే పాదయాత్రను కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు. ఇవాళ కోహెడ నుంచి ప్రారంభమయ్యే ప్రజా సంగ్రామయాత్ర శ్రీరాములపల్లి, పర్వేద, పందిళ్ల మీదుగా పొట్లపల్లి వరకు మొత్తం 13 కిలోమీటర్ల మేరకు కొనసాగనున్నట్లు తెలిపారు. రాత్రి పొట్లపల్లిలోనే బండి సంజయ్ బస చేయనున్నట్లు చెప్పారు.
ఇదీచూడండి:Election Notification 2021 : హుజూరాబాద్, బద్వేల్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల