తెలంగాణ

telangana

ETV Bharat / state

BANDI SANJAY: 'రాష్ట్రంలో దోపిడీ, నియంత, కుటుంబ, గడీల పాలన నడుస్తోంది' - telangana varthalu

తెలంగాణలో దోపిడీ, నియంత, కుటుంబ, గడీల పాలన నడుస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ఆరోపించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ప్రజా సంగ్రామ యాత్ర వర్క్​షాప్​లో ఆయన పాల్గొన్నారు. కర్ణాటక తరహాలో ఉద్యమిద్దామని.. తెలంగాణలో భాజపాను అధికారంలోకి తీసుకొద్దామని పార్టీ శ్రేణులకు ఆయన సూచించారు.

BANDI SANJAY: 'రాష్ట్రంలో దోపిడీ, నియంత, కుటుంబ, గడీల పాలన నడుస్తోంది'
BANDI SANJAY: 'రాష్ట్రంలో దోపిడీ, నియంత, కుటుంబ, గడీల పాలన నడుస్తోంది'

By

Published : Aug 19, 2021, 3:51 PM IST

భాజపా రాష్ట్ర కార్యాలయంలో ప్రజా సంగ్రామ యాత్ర వర్క్​షాప్​లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ పాల్గొన్నారు. ఆయన ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇంకెన్నాళ్లీ బాధలు.. తెగించి కొట్లాడదాం రండి అంటూ కార్యకర్తల్లో ఉత్తేజాన్ని తీసుకొచ్చారు. కర్ణాటక తరహాలో ఉద్యమించి అధికారాన్ని చేజిక్కుంచుకుందామంటూ నినదించారు. తెలంగాణలో దోపిడీ, నియంత, కుటుంబ, గడీల పాలన నడుస్తోందని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో ప్రజలంతా అల్లాడిపోతున్నారని... ప్రశ్నించిన నాయకులు, కార్యకర్తలపై లాఠీలు ఝుళిపిస్తున్నారని బండి సంజయ్​ ధ్వజమెత్తారు.

ఇంకా ఎన్నాళ్లు లాఠీ దెబ్బలు తిందామని.. అధికారమే లక్ష్యంగా తెగించి కొట్లాడాల్సిన సమయం వచ్చిందన్నారు. కర్ణాటక తరహాలో ఉద్యమిద్దామని.. తెలంగాణలో భాజపాను అధికారంలోకి తీసుకొద్దామని పార్టీ శ్రేణులకు సూచించారు. భాజపా కార్యకర్తలంతా రాబోయే రెండేళ్ల పాటు తమ పూర్తి సమయాన్ని పార్టీకి కేటాయించాలని బండి సంజయ్​ స్పష్టం చేశారు.

గడీల పాలన నడుస్తోంది..

నాలుగు కోట్ల మంది ఉన్న తెలంగాణ రాష్ట్రంలో.. ఆ ఆకాంక్షలను పక్కకు పెట్టి కేవలం ఒకే కుటుంబం రాజ్యమేలి.. ఆ కుటుంబం గడీలకు పరిమితమై.. రాష్ట్ర ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో అందరం చూస్తున్నం. దేనికోసమైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నమో.. దానికి భిన్నంగా ఇవాళ గడీల పాలన, కుటుంబ పాలన, రాక్షస పాలన, నయా నిజాం పాలన ఈ రాష్ట్రంలో సాగుతుంది. అనేక సంక్షేమ పథకాలను ఈ యాత్ర ద్వారా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నాం. -బండి సంజయ్​, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

అధికారమే లక్ష్యంగా..

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కమలనాథులు పక్కా వ్యూహంతో పాదయాత్రకు పూనుకున్నారు. తెరాస ప్రభుత్వ వైఫల్యాలను తీవ్రస్థాయిలో ఎండగట్టేందుకు ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. భాజపా రాష్ట్ర రథసారథి బండి సంజయ్‌ నేతృత్వంలో సాగే తొలి విడత పాదయాత్ర ఈ నెల 24న చార్మినార్‌ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభం కానుంది. ఈ పాదయాత్ర సెప్టెంబర్‌ 17న హుజూరాబాద్‌లో భారీ బహిరంగ సభతో ముగించేలా పార్టీ నేతలు ప్రణాళికలు రూపొందించారు. పాదయాత్రను విజయవంతం చేయడం కోసం పాత, కొత్త నాయకులతో 29 కమిటీలను వేశారు. ఇప్పటికే ఆయా కమిటీలు తమ తమ పనుల్లో నిమగ్నమై రూట్‌ మ్యాప్‌ను సిద్ధం చేశాయి. ఈ నేపథ్యంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు వర్క్​షాప్​ నిర్వహించారు.

BANDI SANJAY: 'రాష్ట్రంలో దోపిడీ, నియంత, కుటుంబ, గడీల పాలన నడుస్తోంది'

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details