తెలంగాణ

telangana

ETV Bharat / state

'సీఎం కుమార్తె వాచ్‌కు ఉన్న విలువ వైద్య విద్యార్థిని ప్రాణానికి లేదు' - Bandi Sanjay comments on cm kcr

Bandi Sanjay Comments on CM KCR: మహిళలపై కన్నెత్తి చూస్తే .. యూపీ తరహాలో బుల్డోజర్‌తో ఆస్తులను ధ్వంసం చేస్తామని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ తన బిడ్డను మద్యం కేసులో నుంచి రక్షించాలనే చూస్తున్నారు తప్ప.. రాష్ట్ర మహిళలను కాపాడాలని ఏమాత్రం చూడడం లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు తప్ప చేతలు లేవన్నారు. మళ్ళీ అధికారంలోకి వస్తే అఘాయిత్యాలకు పాల్పడేవారికి ప్రోత్సాహకాలు ఇచ్చేది బీఆర్ఎస్ పార్టీ అని అసహనం వ్యక్తం చేశారు. నేరాలు అదుపులోకి రావాలంటే బీజేపీతోనే సాధ్యమని బండి సంజయ్‌ స్పష్టం చేశారు.

Bandi
Bandi

By

Published : Mar 6, 2023, 5:24 PM IST

Updated : Mar 6, 2023, 9:59 PM IST

'అధికారంలోకి వస్తే... ఉత్తర్ ప్రదేశ్ తరహా బుల్డోజర్‌ విధానం'

Bandi Sanjay Comments on Women Safety: రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతోన్న అత్యాచారాలకు వ్యతిరేకంగా బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టారు. సీఎం కేసీఆర్‌ పాలనలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. సీఎం కేసీఆర్ కూతురు చేతికి ఉన్న వాచ్ విలువ వైద్య విద్యార్థి ప్రాణానికి లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. సీఎం కుమార్తె చేతికి రూ.25 లక్షల విలువైన వాచ్‌ను వాడుతున్నారని, వైద్య విద్యార్థిని ప్రీతి మరణిస్తే రూ. 10లక్షలు ఆర్థికసాయం మాత్రమే అందజేశారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.

వైద్య విద్యార్థి ప్రీతి కేసులో నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. శవానికి ట్రీట్‌మెంట్ చేస్తూ సినిమా చూపించారని విమర్శించారు. ప్రీతి సెల్‌ఫోన్‌లోని డేటా మొత్తం డిలీట్ చేశారని, ఆమె ఎలా చనిపోయిందో ఇప్పటివరకూ స్పష్టత లేదన్నారు. ప్రీతిని తమ కుటుంబసభ్యులు చివరి చూపు చూసుకోకుండా ఆదరా బాదరాగా అంత్యక్రియలు చేశారన్నారు. ప్రీతి మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపడానికి సీఎం కేసీఆర్‌కు అభ్యంతరమేంటి..? అని ప్రశ్నించారు.

Bandi sanjay on preethi isuue: తెలంగాణ సాధనలో మహిళల పాత్ర ఎంతో ఉందని బండి సంజయ్‌ పేర్కొన్నారు. అలాంటి రాష్ట్రంలో మహిళలకు స్వేచ్ఛ, రక్షణ లేదని ఆరోపించారు. ఆరేళ్ల బాలిక నుంచి 60 ఏళ్ల వారి వరకు మహిళలపై దాడులు జరుగుతున్నాయని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై ఎన్ని దాడులు జరుగుతున్నా... సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పోలీసులు ముందే స్పందించి ఉంటే.. వైద్య విద్యార్థిని ప్రీతి చనిపోయి ఉండేది కాదని బండి సంజయ్ అన్నారు. వైద్య విద్యార్థిని ప్రీతి మరణానికి ఇప్పటికీ కారణాలు తెలియటం లేదన్న బండి సంజయ్.. పీజీ మెడికో ఆత్మహత్య చేసుకునేంత పిరికి విద్యార్థిని కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. చనిపోయిన ప్రీతికి నాలుగు రోజుల పాటు చికిత్స చేసి నాటకం ఆడారని ఆరోపణలు చేశారు.

Bandi Sanjay on bjp ruling: కర్ణాటకలో హిజాబ్‌ అంశం గురించి మాట్లాడే ఈ కేసీఆర్‌... సొంత రాష్ట్రంలో మహిళల రక్షణ గురించి ఎందుకు మాట్లాడటం లేదని బండి సంజయ్ ధ్వజమెత్తారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలపై ఇలాంటి దాడులు లేవని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీ గనుక అధికారంలోకి వస్తే... ఉత్తర్ ప్రదేశ్ తరహా బుల్డోజర్‌ విధానం అమలు చేస్తామని ప్రకటించారు.

పూటకో అఘాయిత్యం.. గంటకో మర్డర్.. ఇవన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయి. ఈ ఘటనపై ఇంతవరకు కేసీఆర్ స్పందించలేదు. ప్రీతిది ఆత్మహత్య కాదు.. ఎప్పుడో చనిపోయిన ప్రీతికి చికిత్స పేరిట నాటకం ఆడారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. మహిళలను ఎవరైనా టచ్ చేస్తే.. .యూపీ తరహా బుల్డోజర్ విధానం తీసుకువస్తాం. రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వం... భయం ఏంటో చూపిస్తాం. మహిళల జోలికి వస్తే ఏం అవుతుందో చూపిస్తాం. తెలంగాణ మహిళలకు రక్షణగా బీజేపీ ఉంటుంది. - బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

కల్వకుంట్ల కుటుంబానికి నచ్చితే మెచ్చుకోవడం, లేదంటే అణిచివేయడం తెలంగాణ సమాజానికి మంచిది కాదని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. డాక్టర్ స్థాయికి ఎదిగిన గిరిజనబిడ్డ డాక్టర్ ప్రీతిని హింసించడంతోనే ప్రాణాలు పొగొట్టుకుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలను ఏవిధంగా వేధింపులకు గురిచేసినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీ.కే అరుణ ఆందోళన వ్యక్తంచేశారు.

వైద్య విద్యార్థి ప్రీతి మృతిపై ప్రభుత్వం కనీసం ఆదుకుంటామని కూడా ప్రకటించలేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. మెడికల్ కాలేజీల్లో బోధనా సిబ్బందిలేరని, మెడికల్ కాలేజీల అధ్యాపకుల కొరత, అరాచకాలపై కమిటివేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పదుల సంఖ్యలో హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో మద్యం ఆదాయం మూడింతలు పెరిగిందని, తక్షణమే బెల్ట్ షాపులు రద్దుచేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో మహిళలు రక్షణ లేదని భాజపా సీనియర్ నేత విజయశాంతి అసహనం వ్యక్తంచేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇవే జరుగుతున్నాయన్నారు. వరసగా మహిళలకు అన్యాయం జరుగుతుంటే, మహిళలు హత్యలకు గురవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది..? అని ఆమె ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ మహిళల గురించి పట్టించుకోకుండా సిసోడియా గురించి మాత్రం మాట్లాడుతున్నారన్నారు. సీఎం కూతురు లిక్కర్ స్కామ్ లో ఉన్నారని ఆమెను ఎక్కడ అరెస్ట్ చేస్తారో అని సిసోడియా గురించి మాట్లాడుతున్నారని ఆరోపించారు.

వైద్య విద్యార్థి మృతికి కేసీఆర్ ఏం సమాధానం చెబుతారు..? ఆ కుటుంబానికి ఏం న్యాయం చేస్తారు..? అని ఆమె ప్రశ్నించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిరసన దీక్ష చేపట్టారు. సాయంత్రం నాలుగు గంటలకు భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ బండి సంజయ్ కు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Mar 6, 2023, 9:59 PM IST

ABOUT THE AUTHOR

...view details