తెలంగాణ

telangana

By

Published : Mar 13, 2022, 10:47 PM IST

ETV Bharat / state

'కంటోన్మెంట్ కరెంట్ కట్ చేస్తే.. కేసీఆర్ పవర్ కట్ చేయడం ఖాయం'

Bandi Sanjay On CM KCR: సైనికుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా మంత్రి కేటీఆర్‌ మాట్లాడారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. కంటోన్మెంట్​కు కరెంట్, నీళ్లు నిలిపేస్తామనడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ ప్రజలు త్వరలోనే కేసీఆర్ పవర్ కట్ చేయడం ఖాయమని అన్నారు. హైదరాబాద్​లోని ప్రసాద్ ల్యాబ్స్​లో పార్టీ నేతలతో కలిసి కశ్మీర్ ఫైల్స్ సినిమా వీక్షించారు.

BJP state president Bandi sanjay
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

Bandi Sanjay On CM KCR: పాతబస్తీలో విద్యుత్‌ బిల్లులు వసూలు చేయడం చేతగాక.. కంటోన్మెంట్​లో కరెంట్ చేస్తారా అంటూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్‌ మాటలు ముమ్మాటికీ దేశద్రోహ చర్యేనని బండి సంజయ్ ఆరోపించారు. కంటోన్మెంట్‌కు కరెంట్‌, నీళ్లు నిలిపివేస్తామనటం సిగ్గుచేటన్నారు. కంటోన్మెంట్​లో సైనికులతోపాటు తెలంగాణ ప్రజలు ఉంటారని తెలిపారు. అక్కడ విలువైన భూముల ఆక్రమణకు కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని బండి ఆరోపించారు. హైదరాబాద్​ బంజారాహిల్స్​లోని ప్రసాద్ ల్యాబ్స్​లో పార్టీ నేతలతో కలిసి కశ్మీర్ ఫైల్స్ సినిమా వీక్షించారు. కుహానా శక్తులకు ఈ సినిమాతోనైనా కనువిప్పు కలగాలని ఆకాంక్షించారు. బండి సంజయ్​తో పాటు ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ ఎమ్మెల్యే రామచందర్ రావు సినిమా వీక్షించారు.

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

ప్రజలే పవర్ కట్ చేస్తారు

పవిత్రమైన అసెంబ్లీ వేదికగా దేశాన్ని విచ్చిన్నం చేసేందుకు కుట్ర జరుగుతోందని బండి సంజయ్ మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు త్వరలోనే కేసీఆర్ పవర్ కట్ చేయడం ఖాయమని అన్నారు. కంటోన్మెంట్​కు కరెంట్, నీళ్లు కట్ చేస్తరా? మీరేమైనా రజాకార్లా? నిజాం వారసులా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. తెరాస ప్రభుత్వం ఇలాంటి దేశద్రోహ వ్యాఖ్యలు చేస్తుంటే... మిగిలిన పార్టీలు ఎందుకు స్పందించడం లేదని బండి నిలదీశారు.

సైనికులకు క్షమాపణ చెప్పాలి

ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని బండి సంజయ్ సూచించారు. దేశ సైనిక కుటుంబాలకు, రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఇదే అంశంపై న్యాయపరమైన పోరాటానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

కశ్మీర్ ఫైల్స్’ సినిమా భేష్

జమ్ము కశ్మీర్​లో జరిగిన వాస్తవ విషయాలను ప్రజలకు తెలిసేలా సినిమాను నిర్మించిన వివేక్ అగ్నిహోత్రి, అభిషేక్ అగర్వాల్​లను బండి సంజయ్ అభినందించారు. కశ్మీర్ పండిట్లు, హిందువులపై జరిగిన ఊచకోతను, జిహాదీ పేరుతో తీవ్రవాదులు సాగిస్తున్న మారణకాండను కళ్లకు కట్టినట్లు చూపించారని కొనియాడారు. మతపరమైన సమస్యగా చిత్రీకరిస్తున్న కొన్ని శక్తులు, కాంగ్రెస్ నేతలకు ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమా చూశాకైనా కనువిప్పు కలగాలన్నారు. దేశం ఎక్కడికి పోతే నాకేంది? నాకు రాజకీయాలు, నా కుటుంబం ముఖ్యమని భావించే వాళ్లంతా ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమా చూడాలని బండి సంజయ్ కోరారు.

ఐదుశాతమే చూపించారు: రాజాసింగ్

సెన్సార్ ఇష్యూతో కేవలం 5 శాతం మాత్రమే సినిమాలో చూపించారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఈ సినిమాతో అక్కడ ఏం జరిగి ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇలాంటి సినిమా చూపించినందుకు చిత్రబృందానికి రాజాసింగ్ ధన్యవాదాలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details