కేంద్ర ఎన్నికల సంఘం కొనసాగుతున్న ప్రభుత్వ పథకాలను ఎప్పుడూ నిలిపివేయదని... ముఖ్యమంత్రి కేసీఆరే ‘దళితబంధు’ను పూర్తి స్థాయిలో ప్రారంభించకుండా పథకాన్ని ఆపివేసే అవకాశాన్ని ఈసీకి కల్పించారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. దళితుల్ని కేసీఆర్ మరోసారి మోసం చేశారని అన్నారు. తక్షణమే సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కుట్ర బుద్ధితోనే ఇప్పటివరకు దళితబంధు నిధులు విడుదల కాకుండా ఆపారని తెలిపారు. లబ్ధిదారుల ఖాతాల్లో పడ్డ డబ్బును బ్యాంకులు ఫ్రీజ్ చేసిన దాఖలాలు దేశంలో ఎక్కడా లేవని పేర్కొన్నారు. లబ్ధిదారులు ఆ డబ్బులను డ్రా చేసుకునే అవకాశం కల్పించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారికి వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు.
కుల సంఘాలను చీల్చేందుకు కుట్ర...
రాష్ట్రంలో కుల సంఘాలను చీల్చేందుకు కుట్ర జరుగుతోందని బండి సంజయ్ ఆరోపించారు. కుల సంఘాల భవనాలు అధికార పార్టీకి అడ్డాలుగా మారిపోతున్నాయని విమర్శించారు . కంటోన్మెంట్‌లో సోమవారం రాష్ట్ర మున్నూరు కాపు సంఘం నేత మీసాల చంద్రయ్య ఆధ్వర్యంలో ‘అలయ్.. బలయ్’ నిర్వహించారు. పలువురు కుల సంఘాల నేతలు తమ ఆస్తులు, పదవులను కాపాడుకోవడానికే అధికార పార్టీకి కొమ్ము కాస్తూ, సంఘాలను చీల్చడానికి ఉపయోగపడుతున్నారని విమర్శించారు.