Bandi Sanjay about Podu lands : పోడు భూములకు పట్టాలు ఇస్తానని చెప్పి సీఎం విస్మరించారన్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్... 12ఎస్టీ నియోజకవర్గాల్లో భాజపా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఆ 12 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. గుర్రంపొడులో ఎస్టీ మోర్చా నేతలపై రాష్ట్ర ప్రభుత్వం లాఠీచార్జి చేసిందని గుర్తు చేశారు. 12శాతం రిజర్వేషన్లు ఇస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవ్వలేదని అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ హోటల్లో భాజపా ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ సమావేశం జరిగగా... బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తెరాసకు భాజపా ప్రత్యామ్నాయం
రాష్ట్రంలోని 12 ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, రాబోయే ఎన్నికల్లో ఆయా స్థానాల్లో భాజపా విజయానికి చేపట్టాల్సిన కార్యాచరణపై సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో తెరాసకు భాజపానే ప్రత్యామ్నాయని బండి సంజయ్ పునరుద్ఘాటించారు. జాతీయ నాయకత్వం రాష్ట్ర పార్టీకి అండగా ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, మాజీమంత్రి రవీంద్రనాయక్, చాడ సురేష్ రెడ్డి, హుస్సేన్ నాయక్, ఎస్టీ నియోజకవర్గాల ఇంఛార్జీలు పాల్గొన్నారు.