BJP State Level Meetings On Parliament Elections : లోకసభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కమలం పార్టీ సమాయత్తమవుతోంది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించిన బీజేపీ అదే జోరును పార్లమెంట్ ఎన్నికల్లో కనబర్చేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ మండల అధ్యక్షుల నుంచి జాతీయ స్థాయి నేతల వరకు విస్తృతస్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) ముఖ్య అతిధిగా హాజరై పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. శాసనసభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాలేదని వర్గవిభేదాల వల్లే నష్టపోయామని పార్టీ శ్రేణులకు చురకలు అంటించారు.
లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ - వెన్నుపోటుదారులకు చెక్ పెట్టాలని నిర్ణయం
BJP Parliament Elections 2024 :లోక్ సభ ఎన్నికల్లో పార్టీ నేతలు వర్గవిభేదాలు పక్కనపెట్టి పార్టీ అత్యధిక సీట్లు గెలుపే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్ధేశం చేశారు. దేశ వ్యాప్తంగా 4 వందల ఎంపీ సీట్లే లక్ష్యంగా బీజేపీ జాతీయ నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ప్రతి రాష్ట్రం నుంచి అత్యధిక సీట్లే లక్ష్యంగా రాష్ట్ర పార్టీలను సమాయత్తం చేస్తోంది. తెలంగాణ నుంచి అత్యధిక సీట్లు కైవసం చేసుకోవాలని భావిస్తోంది. రాష్ట్రంలోని 17 సీట్లలో ఖచ్చితంగా పది సీట్లు, 35 శాతం ఓటు బ్యాంకును సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా రాష్ట్ర పార్టీకి ఈ లక్ష్యాన్ని నిర్ధేశించారు. దీంతో రాష్ట్రం నాయకత్వం అత్యధిక సీట్లే లక్ష్యంగా వ్యూహా రచన చేస్తోంది.
BJP Focus On Lok Sabha Elections :ఇప్పటికే సగం ఎంపీ సీట్లకు ఖరారైనట్లు స్వయంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) స్పష్టం చేశారు. సిట్టింగ్ ఎంపీలతో పాటు మరో ఐదు స్థానాలకు అభ్యర్థులు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇంకా ఎనిమిది స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. బీజేపీలో ఎంపీగా పోటీ చేసేందుకు పెద్ధ సంఖ్యలో ఆశావహులు ముందుకు వస్తున్నారు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన నేతలు సైతం ఎంపీగా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. అధిష్టానం టికెట్ ఖరారు చేయనప్పటికీ తమకే వస్తోందన్న ధీమాతో గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసం బీజేపీ రేపు, ఎల్లుండి రాష్ట్ర స్థాయి సమావేశాలను రెండు రోజుల పాటు నిర్వహింస్తోంది.
ఆ పది లోక్‌సభ స్థానాలపైనే బీజేపీ స్పెషల్ ఫోకస్
బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశాలు :ఈ సమావేశాలకు జాతీయ నేతలు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, అర్వింద్ మీనన్ ముఖ్య అతిధులుగా హాజరుకానున్నారు. హైదరాబాద్ వేదికగా నిర్వహించే ఈ సమావేశాల్లో పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, ప్రచార కార్యక్రమాలు, కమిటీల ఏర్పాటుపై చర్చించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసం ప్రతి గ్రామంలో కార్నర్ మీటింగ్‌లను నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ సమావేశాల్లో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీధి సమావేశాల ద్వారా ప్రజలను సమీకరించి పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, నరేంద్ర మోదీ(PM Naredra Modi) సాహాసోపేతమైన నిర్ణయాలు ప్రజల ముందు ఉంచుతూ ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.
నలుగురు సిట్టింగ్ ఎంపీలకు అవకాశం :తెలంగాణకు కేటాయించిన నిధులు, గత బీఆర్ఎస్ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు ప్రస్తుత ప్రభుత్వం ఆరు గ్యాంరటీల అమలులో జాప్యం వంటి అంశాలపై ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఇందు కోసం కమిటీలతో పాటు రూట్ మ్యాప్‌ను సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది. ఒక్కో పార్లమెంట్ స్థానం నుంచి మూడు పేర్లను ఖరారు చేసి జాతీయ నాయకత్వానికి రాష్ట్ర పార్టీ పంపించనుంది. ప్రస్తుతం ఉన్న నలుగురు సిట్టింగ్ ఎంపీలకు మరోసారి అవకాశం కల్పిస్తున్నట్లు జాతీయ నాయకత్వం తెలిపింది. మిగతా స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడింది. మల్కాజ్‌గిరి, జహీరాబాద్ పార్లమెంట్ స్థానాలకు ఎక్కువ పోటీ నెలకొంది.
మల్కాజ్‌గిరి, జహీరాబాద్ స్థానాలకు ఎక్కువ పోటీ : ఈ స్థానాల నుంచి పోటీ చేసేందుకు ఎక్కువ మంది ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు. మల్కాజ్‌గిరి నుంచి ప్రముఖంగా మురళీధర్ రావు, మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు పన్నాల హారీష్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ మూడు పేర్లను అధిష్టానానికి పంపించనున్నట్లు తెలుస్తోంది. మెదక్ ఎంపీగా కేసీఆర్(EX CM KCR) పోటీ చేస్తే అక్కడి నుంచి పోటీ చేయాలని ఈటల భావిస్తున్నారు. లేనిపక్షంలో మల్కాజ్ గిరి నుంచి బరిలోకి దిగేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. మహబూబ్ నగర్ స్థానం నుంచి పోటీ చేసేందుకు మాజీమంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, తల్లోజు ఆచారి ఆసక్తి చూపుతున్నారు.
Lok Sabha Elections 2024 :డీకే అరుణకే ఈ టికెట్ దక్కే అవకాశం మెండుగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఖమ్మం, నల్గోండ, వరంగల్, మహాబూబ్ బాద్, పెద్ధపల్లి పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థులు లేకపోవడంతో ఇతర పార్టీల్లోని బలమైన నేతలను పార్టీలోకి చేర్చుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్కు చెందిన బలమైన నేతలు బీజేపీ(BJP) రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో టచ్‌లోకి వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే కాషాయగూటికి చేర్చుకుని పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలపాలని యోచిస్తోంది.
రాబోయే సంవత్సరం కీలక ఘట్టాలకు వేదిక కాబోతోంది- కిషన్‌రెడ్డి
లోక్‌సభ ఎన్నికల్లో రెండంకెల స్థానాలు ఖాయం : బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్