Tarun Chugh on Buying TRS MLAs Issue: తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. నేతల పరస్పర విమర్శలకు తోడు పోటాపోటీగా ఆందోళనలతో తెరాస, భాజపా కార్యకర్తలు హోరెత్తించారు. తాజాగా ఈ వ్యవహారంపై భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ స్పందించారు. మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి భయంతో భాజపాకు వ్యతిరేకంగా తెరాస బూటకపు కథనాలు వండుతోందని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. ఈ వ్యవహారంలో భారత ఎన్నికల కమిషన్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
మునుగోడు ఉప ఎన్నికల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి భాజపాపై దుష్ప్రచారం చేయడానికి కట్టుకథలల్లారని తరుణ్‌చుగ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వేదికగా నిర్వహించిన మొత్తం ఎపిసోడ్ ఆయన తీవ్ర నిరాశకు నిదర్శనమన్నారు. ఈ కుట్రలో రాష్ట్ర పోలీసుల భాగస్వామ్యాన్ని బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రశ్నిస్తున్న ఎమ్మెల్యేల స్టేట్‌మెంట్ రికార్డ్ చేయడానికి వారిని పోలీసు స్టేషన్‌కు ఎందుకు తీసుకువెళ్లలేదని తరుణ్‌చుగ్ ప్రశ్నించారు.
ఏడీజీ ర్యాంక్ పోలీసు అధికారి నేరం జరిగినట్లు ఆరోపించిన ప్రదేశంలో ఉండాల్సిన పరిస్థితులేమిటని భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. డబ్బు ఎక్కడ పట్టుబడింది.. ఈ మధ్యవర్తులెవరు.. తెరాస ఎమ్మెల్యేలతో బేరసారాలు సాగించేందుకు భాజపా నుంచి ఎవరు వచ్చారని ఆయన ప్రశ్నించారు. మునుగోడు ఎన్నికలపై ప్రభావం చూపేందుకు అధికార పార్టీ ఈ ఘటనకు సూత్రధారిగా ఉన్నట్లు సంఘటనల క్రమాన్ని బట్టి స్పష్టమవుతోందని తరుణ్‌చుగ్ అభిప్రాయపడ్డారు.
అసలేం జరిగిందంటే..తెరాస ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బేరసారాలు జరుగుతున్నాయనే తెలుగు రాష్ట్రాల్లో అంశం సంచలనం సృష్టించింది. సైబరాబాద్ పోలీసులు తమకు అందిన సమాచారంతో హైదరాబాద్ శివారు మొయినాబాద్ అజీజ్‌నగర్‌లోని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో బుధవారం రాత్రి సోదాలు చేశారు. తెరాసకు చెందిన అచ్చంపేట, పినపాక, కొల్లాపూర్, తాండూరు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్‌రెడ్డి, రోహిత్‌రెడ్డిలు పార్టీ మారితే డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామంటూ కొందరు ప్రలోభపెట్టారని పోలీసులు చెప్పారు. ఈ వ్యవహారంలో రామచంద్రభారతి, సింహయాజి, నంద కుమార్‌లను అరెస్టు చేశారు.
ఇవీ చదవండి: